అన్నదాతలు ప్రజాస్వామ్యానికి వెన్నెముక లాంటి వారని, దేశ ప్రగతిరథ సారధులు వారేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తున్న రైతులు.. తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడానికి ఆరేళ్లుగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను రూపొందించి, అమలు చేసిందని తెలిపారు. అందుకే.. వైరస్ ఉధృతిలోనూ వ్యవసాయరంగం అభివృద్ధి సాధించిందన్నారు. చౌరీ చౌరా శతజయంతి సందర్భంగా రైతుల గురించి ప్రసగించారు మోడీ. చౌరీచౌరా పోరాటంలో రైతులు కీలకపాత్ర పోషించారని ఆయన గుర్తుచేశారు. లాభాలు ఆర్జించే దిశగా వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయడమే సర్కార్ లక్ష్యమని చెప్పారు.
దేశ గౌరవం, ఐక్యత అన్నింటి కన్నా ముఖ్యమన్న ఆయన దానిని కాపాడేందుకు మనమంతా ప్రతినబూనాలన్నారు. ‘రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అనేక చర్యలు తీసుకున్నాం. రైతులకు ప్రయోజనం చేకూర్చేలా 1,000 మండీలను ఈ-నామ్‌తో అనుసంధానం చేశాం’ అని మోదీ వివరించారు. చౌరీచౌరా ఘటనలో అమరులైనవారికి చరిత్ర పుస్తకాల్లో ఎలాంటి ప్రాధాన్యమూ దక్కకపోవడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, చౌరీచౌరా శతజయంతి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఏడాదిపాటు నిర్వహించాలని యూపీ సర్కార్ నిర్ణయించింది.
Must Read ;- ట్విట్టర్ వేదికగా రైతు భారతం..!