కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. కాగా జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట వద్ద జరిగిన ఆందోళనలు, జాతీయ జెండాకు అవమానం జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ఓ వైపు పోలీసులు ఆందోళనలపై ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. శనివారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో రైతులకు ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ప్రభుత్వం ఉందని, చర్చలకు సిద్ధమని, నూతన వ్యవసాయ చట్టాలను 18నెలలు వాయిదా వేసేందుకు కూడా సిద్ధమని వ్యాఖ్యానించారు. నూతన వ్యవసాయ చట్టాల రద్దు మాత్రమే పరిష్కారమని రైతు సంఘాలు పట్టుబడుతున్న నేపథ్యంలో మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అఖిల పక్ష సమవేశంలోనూ ఇదే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. మొత్తం మీద పార్లమెంటులో చర్చకు సహకరించడం, రైతుల నిర్ణయమే ఫైనల్‌గా చెప్పిన మోదీ.. రైతుల కోర్టులోకే బంతిని విసిరారని చెప్పవచ్చు. చట్టాల రద్దు తప్ప మిగతా ప్రతిపాదనలకు తాము సిద్ధమని మోదీ ప్రభుత్వం అంటుండగా రద్దు తప్ప వేరే మార్గం లేదని రైతు సంఘాలు చెబుతున్న విషయం తెలిసిందే.
Also Read ;- రైతుల దీక్షలోకి అరాచక శక్తులు, ఢిల్లీ ఉద్రిక్తం
ఆనవాయితీకి భిన్నంగా..
సాధారణంగా ప్రతిసారి పార్లమెంటు సమావేశాల ప్రారంభానికంటే ముందు అఖిల పక్ష సమావేశం జరుగుతుంది. అయితే, ఈ సారి పార్లమెంటు సమావేశాలు మొదలయ్యాక సమావేశం నిర్వహించారు. శుక్రవారం సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. వర్చవుల్ పద్ధతిలో జరిగిన ఈ సమావేశాల్లో ప్రధానంగా రైతు ఉద్యమంపైనే చర్చ నడిచింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలోనూ ప్రతిపక్ష పార్టీలు ఇవే డిమాండ్లను లేవనెత్తాయి. పార్లమెంటు సమావేశాలకు సంబంధించి చర్చించాల్సిన అంశాలు, పార్లమెంటు ముందుకు రానున్న బిల్లులపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో విపక్షాలన్నీ సాగు చట్టాలపై సమగ్ర చర్చకు పదే పదే డిమాండ్ చేసినపుడు ప్రధాని స్పందిస్తూ తాము రైతులతో చర్చలకు ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నామని, ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నామని అన్నారు. ఏడాదిన్నర పాటు కొత్త చట్టాలను వాయిదా వేసేందుకు సిద్ధమని, తాము సానుకూల ఫలితం లక్ష్యంతోనే చర్చలకు వెళ్తున్నామని, తమ వైఖరి అదేనని, జనవరి 22న చివరిసారి చర్చలు జరిగినపుడు ప్రభుత్వం ఏ వైఖరితో ఉందో ఇప్పుడు కూడా అదే వైఖరితో ఉందన్నారు. చట్టాలపై సంయుక్త కమిటీ ద్వారా విచారించేందుకు కేంద్రం సిద్దమేనని వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రకటించిన విషయాన్నిమోదీ ప్రస్తావించారు. దీంతోపాటుగా ఈ ప్రతిష్టంభన తొలగాలంటే పార్లమెంటులో చర్చతోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగితే అన్ని అంశాలపై ప్రభుత్వం చర్చకు సిద్ధమని, సభ సరిగ్గా జరగని పక్షంలో పార్టీలకు మాట్లాడే అవకాశం లేకుండా పోతుందని వ్యాఖ్యానించారు. అకాలీదళ్, ఎల్‌జేపీ, టీఎంసీ, కాంగ్రెస్ పార్టీలు పదేపదే ప్రస్తావించడంతో ఈ మేరకు ప్రధాని వ్యాఖ్యానించారు.
ఈ సమావేశం తరువాత ఎన్డీయే మిత్ర పక్షాలతో మోదీ సమావేశమయ్యారు. ఇక ఇదే సమావేశంలో బీజూ జనతాదళ్ మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించింది. టీఆర్ఎస్, వైసీపీలు మద్దతు పలికాయి. తరువాత విభజన హామీలు అమలు చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు నామా, కేకే లు కోరగా ఏపీ నుంచి టీడీపీ, వైసీపీ కూడా తమ వాదన వినిపించే యత్నం చేశారు. కేకే మాట్లాడుతూ..వ్యవసాయచట్టంపై అభ్యంతరాలు ఎందుకు వస్తున్నాయో కేంద్రానికి చెప్పామన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 38 బిల్లులను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ పై చర్చ, నాలుగు ఆర్డినెన్స్‌లను బిల్లులుగా మార్చడం, 3 చట్టాల ఉపసంహరణ బిల్లులు, ఐదు ఫైనాన్స్ బిల్లులు ఉన్నాయి.
Must Read ;- రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం.. ఒకరి మృతి