ప్రియుడి మోజులో ఓ వివాహిత భర్తను హతమార్చిన సంఘటన శ్రీకాకుళం జిల్లాలోని ఒక మారుమూల ప్రాంతంలో జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సంఘటనలో తండ్రి చనిపోగా, తల్లి జైలు పాలవ్వడంతో అభం శుభం తెలియని వారి పిల్లలు శ్రీజ(7), సిద్దూ(5) అనాథలయ్యారు. సెల్‌ఫోన్ ఛార్జింగ్ వైరును భర్త మెడకు చుట్టి దారుణంగా హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూసిందామె. పోస్టుమార్టం నివేదికలో అది హత్యగా తేలడంతో సిక్కోలు వాసులు నివ్వెరపోయారు.
కొత్తూరులో ..
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు ఎస్సై వై.సింహాచలం తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు కాలేజీ రోడ్డుకు ఆనుకొని నివాసం ఉంటున్న దూలి రాము(35) ఈ నెల 26వ తేదీన చనిపోయాడు. తొలుత దీన్ని అందరూ అత్మహత్యగా భావించారు. ఆయన తల్లి లక్ష్మి రామును హత్య చేశారని ఆరోపిస్తూ అదేరోజున పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాము మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. నివేదికలో వైద్యులు హత్యగా నిర్ధారించారు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించి రాము భార్య కుమారికి అదే గ్రామానికి చెందిన సొండి సతీష్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్టు గుర్తించారు. వారిరువురిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్టు ఎస్సై చెప్పారు. తమ ఆనందానికి రాము అడ్డుగా ఉండేవాడని, దీంతో ప్రాణం తీసి అడ్డు తొలగించుకోవాలనుకున్నట్లు చెప్పినట్టు వివరించారు.
కుటుంబ సభ్యులను నమ్మించేందుకు ..
సెల్‌ఫోన్ ఛార్జింగ్ వైరును రాము మెడకు గట్టిగా బిగించి ప్రాణం తీసినట్లు ఎస్ఐ తెలిపారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులను నమ్మించేందుకు ఉరి వేసుకున్నట్లు మెడకు చున్నీ చుట్టి ఫ్యాన్‌కు వేలాడిదీసినట్టు కుమారి, సతీష్‌లు అంగీకరించారన్నారు. ఇద్దరినీ అరెస్టు చేసి శ్రీకాకుళం జ్యుడిషియల్ మెజిస్టేట్ కోర్డులో హాజరు పరిచారు.










