రాడ్ రంబోలా.. ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన పదమిది. బాలయ్య అన్ స్టాపబుల్ పుణ్యమా అని అందరి నోళ్లలోనూ ఈ పదం నానుతోంది. ఈరోజు విడుదలైన సినిమాలు చూసి జనం రాడ్ రంబోలా అన్న కామెంట్లే చేస్తున్నారు. కనీసం ఒక్కటంటే ఒక్కటి జనం దృష్టిని ఆకర్షించలేకపోయింది. సినిమా రంగంలో బ్లాక్ ఫ్రైడే అంటే ఇదేనేమో. దాదాపు 10 సినిమాలు ఈరోజు విడుదలైతే ఏ థియేటర్ దగ్గరా సందడి లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కనీసం ఏదైనా పెద్ద సినిమా ఈరోజు విడుదలై ఉంటే వేరేలా ఉండేది. ఈరోజు విడుదలై రెండో రోజు టపా కట్టేసే సినిమాలే ఈ వారం జనం ముందుకు వచ్చాయి.
థియేటర్లకు ఓటీటీ అనేది చక్కటి పోటీ ఇస్తోంది. తమ సినిమా మీద నమ్మకం లేకపోతే ఎంచక్కా ఏదో ఒక ఓటీటీ సంస్థను ఆశ్రయించవచ్చు. ఎంతో కొంత గిట్టుబాటయ్యేది. ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడులా పరిస్థితి తయారైంది. ఏ థియేటర్ దగ్గర చూసినా ఏమున్నది గర్వకారణం.. బుక్ మై షో సైతం.. జనం లుక్ లేని వైనం.. అంటూ కవిత్వం రాయాల్సి వస్తోంది.
కొన్ని సినిమాల్లో సరైన నటీనటులు లేకపోగా, మరికొన్ని సినిమాల్లో మంచి ప్యాడింగ్ ఉన్నా వాటి వైపే జనం చూడలేదు. ఎంతో ఖర్చుపెట్టి సినిమా తీస్తే ఇంత చిన్నచూపేంటబ్బా అని అందరూ విస్తుపోక తప్పలేదు. సినిమా టైటిల్స్ లో కొత్తదనం ఉందిగానీ జనం దృష్టికి అవి వెళ్లలేకపోయాయి. ఇన్ని సినిమాల్లో ఏది చూసి రివ్యూ చేయాలో సమీక్షకులకు సైతం అర్థం కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.
ఆ పదికీ ఆపదే..
ఈరోజు విడుదలైన పది సినిమాలకూ ఆపదే అని చెప్పాల్సి ఉంటుంది. సినిమా తీయాలంటే తక్కువలో తక్కువ కోటి, రెండు కోట్లు లేకుండా సాధ్యం కాదు. సినిమా తీస్తే చేతులు ఎలా కాలతాయో అనుభవం లేని వారికి ఈరోజు అర్థమయ్యే ఉంటుంది. మిస్సింగ్, పోస్టర్, రావణ లంక, రామ్ అసుర్, స్ట్రీట్ లైట్, ఊరికి ఉత్తరాన, సావిత్రి – సత్యమూర్తి, ఛలో ప్రేమిద్దాం.. ఇలా ఉన్నాయి ఈరోజు విడుదలైన సినిమాల పేర్లు.
బహుశా వీరంతా ఓటీటీ సంస్థలను ఆశ్రయించినా వర్కవుట్ కాకపోవడంతో థియేటర్లలో విడుదల చేయాల్సి వచ్చిందేమో. కనీసం థియేటర్ కరెంటు ఖర్చులకు కూడా డబ్బులు వచ్చే పరిస్థితి కొన్ని సినిమాలకు లేదు. థియేటర్ కు ఎదురు రెంట్ కట్టి తమ సినిమాలను ఆడించుకోవడం తప్ప మరో మార్గం లేదు. అందుకే వీటిలో కొన్ని ఈ ఒక్క రోజు షోకే పరిమితమైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. సినిమా రివ్యూలకు అతీతమైన శుక్రవారం ఇది.











