మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆయన ఇంత వేగంగా సినిమాలు చేయడానికి కారణం ఏమిటో ఎవరికీ అంతుబట్టడం లేదు. ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య, భోళాశంకర్.. ఇలా నాలుగు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇంత మెగా దూకుడు వేరే ఏ హీరో చూపడం లేదు. భోళాశంకర్ చిత్రం ప్రారంభోత్సవం ఈరోజు ఉదయం జిరిగింది. క్రియేటివ్ కమర్షియల్స్ సహకారంతో ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు క్లాప్ కొట్టగా మరో దర్శకుడు వి.వి. వినాయక్ కెమెరా స్విచ్చాన్ చేశారు.
క్రియేటివ్ కమర్షియల్ అధినేత కె.ఎస్. రామారావుకు గతంలో ఎన్నో హిట్ సినిమాలను మెగాస్టార్ చేశారు. చిరంజీవి ఈ చిత్రాన్ని చేయడంలో కె.ఎస్. రామారావు పాత్ర చాలా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవలి కాలంలో కె. ఎస్. రామారావుకు సరైన హిట్ లభించలేదు. అలాంటి హిట్ మళ్లీ సాధించాలంటే మెగా సహకారం అవసరమని భావించినట్లు తెలుస్తోంది. ఇక డైరెక్టర్ గా మెహర్ రమేష్ కు అవకాశం రావడానికి కొంత ఆయనకు చిరంజీవితో ఉన్న బంధుత్వం కారణం అన్న మాట వినిపిస్తోంది. దాంతో పాటు మెహర్ రమేష్ ను కన్నడ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేసింది కూడా కె. ఎస్. రామారావే.
ఈ సినిమా స్క్రిప్టు విషయంలో సీనియర్ రైటర్ సత్యానంద్ సహకారం కూడా తీసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో పనిచేయాలన్నది తన చిరకాల కల అని, తన శక్తినంతా ఈ కథ మీద పెట్టానని మెహర్ రమేష్ అన్నారు. కమర్షియల్ గా అందరికీ నచ్చేలా ఈ సినిమా చేస్తానన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటిస్తోంది. ఈ ప్రారంభోత్సవానికి ఆమె కూడా హాజరయ్యారు. నటి కీర్తి సురేష్ ఇందులో చిరంజీవి చెల్లిగా నటిస్తున్నారు. దీని రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 15 నుంచి జరగనుంది.
ప్రధానంగా అన్నాచెల్లెళ్ల అనుబంధం మీద ఈ కథ ఉన్నట్లు దర్శకుడు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. ఆచార్య చిత్రం వచ్చే ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ఆ తర్వాత గాడ్ ఫాదర్, దాని తర్వాత భోళా శంకర్ విడుదలవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. తమిళంలో హిట్ అయిన వేదాళం చిత్రం ఆధారంగా భోళాశంకర్ తెరకెక్కుతోంది. గాడ్ ఫాదర్ మాత్రం మలయాళ చిత్రం ‘లూసిఫర్’ ఆధారంగా రూపొందుతోంది.











