(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు నిర్ణయించిన భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఇంకా సన్నాహక దశలోనే ఉంది. ఎయిర్ పోర్టుకు ఇంకా శంకుస్థాపన కూడా జరగలేదు. అప్పుడే రాష్ట్రంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జోరందుకుంది. విశాఖ ఎయిర్ పోర్టులో పౌర విమానయాన కార్యకలాపాలు నిలిపి వేయాలని కోరుతూ వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రానికి లేఖ రాయడం వైరివర్గాల మధ్య అగ్గి రాజేసింది. దీనిపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే… అంతే ఘాటుగా వైసీపీ ప్రతిస్పందిస్తోంది.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ..
ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడానికి భోగాపురంలో విమానాశ్రయం నిర్మిస్తున్నామని, అక్కడ వాణిజ్య కార్యకలాపాలు మొదలైన నాటి నుంచి 30 ఏళ్లపాటు విశాఖలో పౌర విమానాశ్రయాన్ని మూసి వేయాలని కోరుతూ పౌర విమానయాన శాఖ మంత్రి హరదీప్‌సింగ్ పూరీకి కొద్ది రోజుల క్రితం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ అందజేశారు. ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన విజయసాయిరెడ్డి ఈ మేరకు ప్రతిపాదించారు.
Also Read:-అసందర్భం ఎఫెక్ట్.. విశాఖలో సాయిరెడ్డి రాజీడ్రామా
అగ్గి రాజేస్తున్న లేఖ ..
ఈ లేఖ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అగ్గి రాజేస్తోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి ఆజ్యం పోసింది. ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన లేఖపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భోగాపురంలో ఇంకా విమానాశ్రయం శంకుస్థాపనే జరగలేదని, ఈ సమయంలో కేంద్రానికి లేఖ ఎలా రాస్తారని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఎవరి లబ్ధి కోసం కేంద్రమంత్రికి లెటర్ రాశారని నిలదీస్తోంది. జనసేన కూడా ఈ లేఖపై ఘాటుగానే స్పందించింది. విశాఖ ఎయిర్‌పోర్టును మూసివేయాలనే ప్రతిపాదనను ఖండిస్తున్నామని జనసేన నేతలు ప్రకటించారు. ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే విశాఖ వాసులు ఊరుకోరని హెచ్చరించారు.
ధీటుగా ఎంపీ బదులు ..
విపక్షాల విమర్శలకు ఎంపీ విజయసాయిరెడ్డి ధీటుగా బదులిచ్చారు. విశాఖ ఎయిర్ పోర్ట్ నేవీకి చెందినదని, కేంద్రానిది కాదని అన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వచ్చాక, విశాఖ విమానాశ్రయాన్ని నేవికి అప్పగిస్తామని స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన విమర్శలపై విరుచుకుపడ్డారు.
Also Read:-రాజధాని దిశగానేనా? : విశాఖ మెట్రోకు అడుగులు పడుతున్నాయ్!
ఇదిలా వుండగా ..
భోగాపురం విమానాశ్రయం అభివృద్ధికి ఏకంగా 30 ఏళ్లు విశాఖ పౌర విమానాశ్రయాన్ని మూసేయాలని కోరడం ఏంటనే వాదన రాష్ట్రంలో బలంగా వినిపిస్తోంది. ఒక సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని, మరొకటి మూసేయడం తగదని, రెండూ కొనసాగించాలనే ఆకాంక్ష వ్యక్తమవుతోంది. పరిస్థితులు ఎలా మారతాయో వేచి చూడాలి.