గ్రేటర్‌లో పాగా వేసేందుకు బీజేపీ ముమ్మర ప్రచారాలకు దిగుతోంది. రాష్ట్ర , కేంద్ర ముఖ్య నేతలు సుడిగాలి పర్యటనలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళ్తుండగా వారికి తోడుగా ఆ పార్టీ ముఖ్యనేతలు క్షేత్ర స్థాయి ప్రచారం చేయబోతున్నారు. నేటి నుండే ఆ పార్టీ ముఖ్యులంతా రంగంలోకి దిగి ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఎట్టిపరిస్థితుల్లోను గ్రేటర్‌లో పాగా వేసేందుకు బీజేపీ వేస్తున్న ప్లాన్స్‌ను వర్కౌట్ చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.
ఒక్కో నేత … ఒక్కో అంశం..
గ్రేటర్‌లో అంతా ఒకే అంశంపైన కాకుండా నేతల మనస్థత్వాన్ని బట్టి ప్రచార బాధ్యతలు అప్పగించింది జాతీయ నాయకత్వం. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి స్టార్ క్యాంపేయినర్‌గా ప్రచారంలోకి దిగనున్నారు. ఆయనకు గ్రేటర్‌పై మంచి పట్టుంది. ప్రజల సమస్యలపై ఆయన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రచారం చేయగలరు. కాబట్టి ఆయనకు తనదైన శైలిలో గ్రేటర్ అభివృద్ధిపై సర్కార్ అసమర్ధతను ప్రజల్లో పెట్టేలా బాధ్యతలు అప్పగించారు. ఇక మరో సీనియర్ నేత, జాతీయ ఓబీజీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు కూడా నగరంలో మంచి పట్టుంది. మొన్నటి వరకు ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఓబీజీ మోర్చా అధ్యక్షుడిగా నియమించడంతో ఆయన ఆ వర్గాలు బీజేపీ వైపు చూసేలా బాధ్యతలు కట్ట బెట్టింది. ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఆయన బీసీలకు బీజేపీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందనే సంకేతాలను వారిలోకి తీసుకువెళ్ళి తమ పార్టీకి ఓటేసేలా చేయడం ఆయన పని.
Also Read:-బీజేపీ జనసేన మధ్య పొత్తు కుదురుతోంది!
హిందుత్వంతో దూకుడుగా సంజయ్..
ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తనకు తగ్గట్టుగా హిందుత్వ ఎజెండాను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళుతున్నారు. భాగ్యలక్ష్మి ఆలయ సవాల్ ప్రజల్లోకి దూసుకువెళ్ళింది. ఆయనకు యువతలో మంచి క్రేజ్ ఉన్నందున వారిని ఆకట్టుకునేలా ప్రచారం చేయడంతో పాటు హిందువులకు జరిగే అన్యాయాలపై పోరాటాలకు ఎక్కడి వరకైనా వెళ్ళేందుకు సిద్ధమంటున్నారు. మరోవైపు ధర్మపురి అరవింద్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ముఖ్యనేతలే టార్గెట్‌గా ప్రచారం నిర్వహించనున్నారు. ఆయన ప్రచారం కూడా యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు ఆయన ముస్లీంలకు బీజేపీతోనే న్యాయం జరుగుతుందన్న భరోసా కల్పించేలా ప్రచారం చేస్తున్నారు. దీంతో బండి సంజయ్ హిందుత్వం అంశాలతో ప్రచారం చేస్తుంటే, ముస్లీం వర్గాలను కూల్ చేసేందుకు అరవింద్‌కు బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది.
మహిళలు, యువకులను ఆకట్టుకునేందుకు డీకే, రఘునందన్
గ్రేటర్ హైదరాబాద్‌లో మహిళా ఓటర్లు సైతం ప్రభావం చూపిస్తారు. వారిని ఆకట్టుకునేందుకు ఆ పార్టీ ముఖ్యనేత, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను రంగంలోకి దింపారు. నేడు డీకే అరుణతో అధికారికంగా రోడ్ షోను ప్రారంభించనున్నారు. మహిళలను ఆకట్టుకునేలా ప్రభుత్వంపై ఆమె మాటల తూటలు పేల్చగలరు. దీంతో ఆమెతో ప్రచారం బీజేపీకి మరో బలం. కేసీఆర్ , హరీశ్ ఇలాఖాలో టీఆర్ఎస్‌ను ఓడించి బీజేపీ జెండాను ఎగర వేసిన తాజా ఎమ్మెల్యే రఘునందన్ బీజేపీకి మరో బలం. తన పదునైన విమర్శలు, సూటిగా టార్గెట్ చేసే విధానం యువతను పార్టీ వైపు ఆకర్శిస్తోంది. దీంతో ఆయన్ను కూడా పార్టీకి సీట్లు తెప్పించగల అస్త్రంగా వినియోగించ నుంది. మొత్తానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.











