కడపజిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలోని వేంపల్లె మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. రెండు వర్గాలకు చెందిన నాయకులు కలబడి కొట్టుకున్నారు. అది కూడా వైఎస్సార్ సమాధి ఉన్న ఇడుపులపాయ పంచాయతీ పరిధిలోనే కావడం గమనార్హం. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే సొంత పార్టీ నాయకులే ముఠాలుగా కలబడి కొట్టుకోవడం అనేది పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది.
అధికార పార్టీలో గ్రూపు తగాదాలు అనేవి.. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో ఉన్నాయి. గ్రూపులు కలబడి కొట్టుకోవడం, పోలీసు కేసులు నమోదు కావడం కూడా చాలా చోట్ల జరుగుతుంది. గ్రూపుల మధ్య ఒకరికి వ్యతిరేకంగా ఒకరు చాపకింద నీరులా పావులు కదపడం, ఒకరికి చెడ్డపేరు వచ్చేలా మరొకరు.. వ్యూహాలు పన్నడం అనేది ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో ఉందనే చెప్పాలి.
ఎంత ఘోరంగా పార్టీలోని అనైక్యత పెచ్చరిల్లినా సరే.. రాష్ట్రంలోని 174 నియోజకవర్గాల్లో గ్రూపులుగా మారిపోయి కొట్టుకోవడం ఒక ఎత్తు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గ పరిధిలో వర్గాలు కలబడడం ఒక్కటీ మరో ఎత్తు. అలాంటిదే వీరన్నగట్టుపల్లెలో జరిగింది.
వేంపల్లి మండలం ఇడుపులపాయ పంచాయతీ లోని విరన్నగట్టు పల్లె లో గ్రూపు లుగా విడిపోయిన వైసిపి పార్టీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. పుల్లయ్య వర్గం, చలపతి వర్గం ఇద్దరి మధ్య తగాదాలు రేగాయి. పుల్లయ్య వర్గానికి చెందిన నలుగురిని చలపతి వర్గం వారు తీవ్రంగా గాయపరిచారు. పోలీసులు, గాయపడిన వారిని వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నట్లు ఇడుపులపాయ ఆర్కె వ్యాలీ పోలీసులు తెలిపారు.
AlsoRead ;-వైఎస్ వివేకా హత్య కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
AlsoRead ;- పొన్నపురెడ్డీ… ఇంత జరిగినా ప్రతీకారాన్ని వీడరా?