స్థానిక ఎన్నికల విషయమై ఎవరూ పట్టువీడడం లేదు. అటు ప్రభుత్వం.. ఇటు ఎన్నికల కమిషన్.. ఇద్దరూ తామే కరెక్ట్ అన్నట్లుగా వ్యవహారిస్తున్నారు.
ముద్రగడ హితవు
ఇన్ని గొడమల మధ్య కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ని ఉద్దేశించి రాసిన లేఖ సంచలనంగా మారింది. రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు, ప్రభుత్వానికి జరుగుతున్న పరిణామాలు చూస్తే విచారకంగా ఉందంటూ పేర్కొన్నారు. ఉన్నతమైన పదవిలో ఉంటూ రాజకీయం సరికాదంటూ నిమ్మగడ్డ ప్రవర్తనను తప్పుపట్టారు.
ముద్రగడ లేఖ
‘గత కొంత కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్నాను. రాష్ట్ర పరిస్థితిని చూస్తే బాధగా ఉంది. ఎన్నికల కమిషనర్ హోదాలో ఉండి.. మీరు ఇలా రాజకీయాలు చేయడం ఉత్తమం కాదు. మీరు పట్టుదలకు పోయి పరిస్థితులను క్లిష్టంగా మార్పడం సరికాదు. మిమ్మల్ని ఎవరో వెనక నుండి నడిపిస్తున్నారని నాకు అనుమానాలు తలెత్తుతున్నాయి. మీరు పెద్ద చదువులు చదువుకున్న వ్యక్తి, ఉన్నత పదవిని చేపట్టారు. అలాంటి మీరు, ఇలాంటి రాజకీయాలు చేయడం మంచిది కాదు. మీ తగాదాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో గందరగోళ పరిస్ధితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితిని దేశంలో మొదటి సారిగా చూస్తున్నాము. మీకు ఎన్నో విశిష్ట అధికారాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించి ప్రజలకు మేలు చేసే విధంగా సూచనలు చేస్తే మంచిది. ప్రజల డబ్బును ఉపయోగించి మీరిలా న్యాయస్థానంలో వాదించుకోవడం ఎంత వరకు సబబనే విషయం మీరే ఆలోచించండి.’ అంటూ నిమ్మగడ్డకు హిత వ్యాక్యాలు చెప్పారు ముద్రగడ పద్మనాభం.
నిమ్మగడ్డకు మాత్రమే ఎందుకు?
నిమ్మగడ్డకే లేఖ రాయడంలో ఆంతర్యం ఏమిటి? ఇదే మాట.. ఇదే పని జగన్ విషయంలో చేయచ్చు కదా. జగన్‌కు ఇలా లేఖ రాసేంత ధైర్యం ఉంటుందా. అసలే ఎవరు చెప్పినా, సలహాలు ఇచ్చినా మన సిఎం గారు కోపంతో ఊగిపోతారని అందరూ అనుకుంటుంటారు. మరి ఇదే లేఖను జగన్‌కు రాసేంత ధైర్యం చేసేంత ఆలోచన కూడా చేయలేరు. ఇక ముద్రగడ పేర్కొన్న విషయాల కొస్తే, సమాజ హితమైన పనులు చేయమని చెప్పారు. ఇప్పుడు నిమ్మగడ్డ చేస్తున్నది సమాజ ద్రోహంగా ఎందుకు కనిపిస్తుందో అర్థం కావడం లేదు? ఇప్పటికే గడువుతీరి పోయిన పంచాయతీకి ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల కమిషన్ ధర్మం. ఏ సందర్భంలో నిర్వహించాలనేది ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుంది. అంతేకానీ, ప్రభుత్వానికి ఎప్పుడు కుదిరితే అప్పుడు ఎన్నికలు జరపాలంటే ఎలా కుదురుతుంది? మరి ముద్రగడ గారి ఉద్దేశం అదేనా?
Must Read ;- పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ స్నిగల్..