(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
గిరిజనుల ఆరాధ్య దేవత, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ జాతర సోమవారం ఉదయం వైభవంగా ప్రారంభమైంది. ఆంధ్రా – ఒడిశా సరిహద్దులలో విజయనగరం జిల్లా మక్కువ మండలంలో శంబరలో వేంచేసి ఉన్న పోలమాంబ ఉత్సవాలు నెల రోజులపాటు సంప్రదాయబద్ధంగా.. అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ జాతరలో తొలెళ్లు, సిరిమాను సంబరం అత్యంత విశిష్టమైనవి. సోమవారం ఉదయం తొలేళ్లు ఉత్సవం సంప్రదాయబద్ధంగా ప్రారంభమైంది. మంగళవారం నిర్వహించే తొలేళ్లు ఉత్సవానికి ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఇతర ప్రాంతాల వారిని అనుమతించబోమని పోలీసులు చెబుతున్నారు. ప్రజల ఆరోగ్యం దష్ట్యా ప్రజలెవరూ జాతరకు రావద్దని జిల్లా ఎస్పీ బి.రాజకుమారి కోరారు. కాగా పోలమాంబ జాతరకు 600 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
శంబరకు పండగ శోభ
గిరిజన ఆరాధ్య దైవం పోలమాంబ జాతరతో శంబర పండగ శోభ సంతరించుకుంది. సోమవారం తోలెళ్ల ఉత్సవం, మంగళవారం సిరిమానొత్సవం, బుధవారం అంపొత్సవం జరుగనున్నాయి. కోవిడ్ నిబంధనలతో దేవాదాయ శాఖ ఆన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతరను పురస్కరించుకొని దేవాదాయ ధర్మాదాయ శాఖ అమ్మవారి దేవాలయాలతో పాటు భక్తులకు కనువిందు చేసేందుకు విద్యుత్ కాంతులతో శోభాయమానంగా వనం గుడి, చదును గుడి యాత్ర ప్రదేశాలలో చేసిన ఏర్పాట్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి.
కోవిడ్ నిబంధనలతో..
అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు కోవిడ్ నిబంధనలు పాటించాలి. ప్రతి ఒక్కరూ తప్పక మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటిస్తూ ఉండే విధంగా జాతరకు వచ్చే భక్తులకు సంబంధిత శాఖలతో అవగాహన కల్పించేందుకు ప్రధాన కూడలిలో కోవిడ్ నిబంధనలు తెలిపే విధంగా ఫ్లెక్సీలు, శానిటేజర్లు ఏర్పాటు చేశారు. అలాగే మాస్కుల పంపిణీకి చర్యలు చేపడుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.
పారిశుధ్యంపై ప్రత్యేక ప్రణాళిక
శంబర గ్రామ పంచాయతీ అమ్మవారి పండగ సందర్భంగా ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీ స్వీపర్స్, మొత్తం 27 బృందాలుగా ఏర్పడి 27 పర్యవేక్షణా ప్రాంతాలను ఏర్పాటు చేసుకొని నిరంతరం పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
భక్తులకు అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు
పార్వతీపురం సబ్ కలెక్టర్ విధేఖర్, ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్‌ల సూచనలు, సలహాలు పాటిస్తూ యంత్రాంగం ఎప్పటికప్పుడు ఆన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధానంగా దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో ఉన్న వారికి త్రాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులకు ప్రసాదం అందించేందుకు ప్రత్యేక కౌంటర్లు సిద్ధం చేశారు. మంగళవారం నిర్వహించనున్న సిరిమానోత్సవానికి రథం సిద్ధం చేశారు.
Must Read ;- రామతీర్థంలో విగ్రహాల ప్రతిష్ఠకు శ్రీకారం