నూజివీడు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలోనే కొనసాగించాలంటూ కాపు నేతలు చేపట్టిన ఉద్యమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల నూజివీడు నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పడబోయే ఏలూరు జిల్లాలో కలపనున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ కాపు నేతలు నూజివీడులో ఉద్యమం ప్రారంభించారు. దీన్ని వ్యతిరేకిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, కాపు నేత ఏనుగు వెంకటేశ్వరావు చొక్కా పట్టుకుని నెట్టివేయడం వివాదానికి దారి తీసింది. అప్పారావు చర్యతో నూజివీడులో కాపులంతా ఒక్కటయ్యారు. కాపు నేత ఏనుగు వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంకట అప్పారావు చర్యను కృష్ణా జిల్లా కాపు నేతలు ఖండించారు. తమ నేతకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు నేతలు ఏనుగు వెంకటేశ్వరావుకు మద్దతుగా నిలిచారు. దీంతో వైసీపీకి కాపులు దూరం అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
నూజివీడు టు విజయవాడ
నూజివీడు నియోజకవర్గాన్నికొత్తగా ఏర్పడబోయే విజయవాడ జిల్లాలో కలపాలంటూ కాపు నేతలు చేపట్టిన ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతోంది. ఉద్యమం చేస్తున్న వారిపై నూజివీడు ఎమ్మెల్యే దాడికి దిగడం వైసీపీ శ్రేణులు, కాపు నేతల మధ్య ఆజ్యం పోసింది. వైసీపీ ప్రజాప్రతినిధులు కాపులపై దాడులకు దిగడం సిగ్గుచేటని బాధితుడు ఏనుగు వెంకటేశ్వరరావు విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యే క్షమాపణ చెప్పకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు. కాపుల కార్పొరేషన్‌కు ఒక్క రూపాయి నిధులు ఇవ్వకపోగా, కోట్లాది రూపాయల కాపు కార్పొరేషన్ నిధులను అమ్మఒడి పథకానికి తరలిస్తున్నారని కాపు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో కాపులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు అభిప్రాయపడుతున్నారు.
వైసీపీకి దూరం అవుతున్న కాపులు
కోస్తా జిల్లాలో కాపులు వైసీపీకి దూరం అవుతున్నారు. అనేక సంక్షేమ పథకాలు ఉన్నా కాపులను చిన్నచూపు చూడటం, కేవలం వైసీపీలో తిరిగే వారికే సంక్షేమ పథకాలు ఇవ్వడంతో కాపులు వైసీపీ నేతల తీరుపై గుర్రుగా ఉన్నారు. నాలుగు జిల్లాల్లో కాపుల ఓట్లతో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తమను పట్టించుకోవడం లేదని కాపు నేత ఏనుగు వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఒక్క నామినేటెడ్ పదవి కూడా కాపులకు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కాపులను మోసం చేస్తోందని ఆయన విమర్శించారు
Must Read ;- ప్రకాశం వైసీపీలో అసంతృప్తి గళాల అసలు కథేంటి?