అక్కినేని నాగార్జున ఎర్లియర్ గా వైల్డ్ డాగ్ అనే యాక్షన్ మూవీతో మంచి పేరు తెచ్చుకున్నారు. హైద్రాబాద్ లోని వరుస బాంబ్ ప్రేళుళ్ళ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నాగ్ యన్.ఐ.ఏ ఆఫీసర్ గా ఆకట్టుకున్నారు. ఇక దీని తర్వాత సినిమాలో కూడా నాగ్ .. ఇంచు మించు అలాంటి పాత్రనే పోషిస్తుండడం విశేషం. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ యాక్షన్ అడ్వెంచరస్ మూవీలో నాగార్జున వెటరన్ రా ఏజెంట్ గా కనిపిస్తారు. అయితే ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ ప్రధానంగా ఉంటుంది. అందుకే నాగార్జున.. యాక్షన్ సన్నివేశాల్లో ఒరిజినాలిటీ తీసుకురావడం కోసం.. ఎలాంటి డూప్ లేకుండా పాల్గొనబోతున్నారట.
దానికోసం నాగ్.. మార్షల్ ఆర్ట్స్ నిపుణులచేత శిక్షణ తీసుకుంటున్నట్టు వినికిడి. బ్యాంకాక్ కు చెందిన యుద్ధకళ ఇది. ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్పెస్ ఆత్మరక్షణ కోసం దీన్ని ఉపయోగిస్తారట. ఇందులో క్రావ్ మగా, సమురాయ్ స్వార్డ్ ఫైట్స్ ముఖ్యమైనవి. అయితే ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో .. ఆన్ లైన్ క్లాసెస్ లో వీటిని ప్రాక్టీస్ చేస్తున్నారట. ఒక నిపుణుడి పర్యవేక్షణలో నాగ్ ఈ శిక్షణ తీసుకుంటున్నారట.
‘గరుడ వేగ’ సినిమాతో .. యాక్షన్ అండ్ ఇన్వెస్టిగేటివ్ సినిమాల్ని గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లేతో తీయగలనని ప్రూవ్ చేసుకున్న ప్రవీణ్ సత్తారు.. ఈ సినిమా కోసం కూడా అలాంటి కథాంశాన్నే ఎంచుకున్నాడు. కాజల్ అగర్వాల్ కూడా రా ఏజెంట్ గా నటిస్తోన్న ఈ సినిమా కోవిడ్ హడావిడి తగ్గిన తర్వాత రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళబోతోంది. మరి ఈ సినిమా తో నాగార్జున ఏ రేంజ్ లో హిట్ సొంతం చేసుకుంటారో చూడాలి.











