‘అతనొక్కడే, పటాస్, 118’ లాంటి సినిమాలు తప్ప నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో చెప్పుకోదగ్గ మరో సినిమా లేదు. అయినప్పటికీ.. హీరోగా నిలదొక్కుకొనేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తునే ఉన్నాడు. ప్రస్తుతం తమ్ముడు యన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలోని సినిమాకి నిర్మాణ భాగస్వామ్యం వహిస్తునే.. తను హీరోగా పలు సినిమాల్ని లైన్ లో పెట్టుకున్నాడు. అందులో ఒక సినిమాలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు గా .. రూపొందనున్న ఈ సినిమాకి రాజేంద్ర అనే యువకుడు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇక ఈ సినిమాకి ‘ఎమిగోస్’ అనే వెరైటీ టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. స్పానిష్ లో ఎమిగోస్ అంటే స్నేహితులు అని అర్ధం. ఇక ఇందులో కథానాయిక కోసం అన్వేషణ జరుగుతోంది.
కళ్యాణ్ రామ్ తమ్ముడు .. యన్టీఆర్ ‘జై లవకుశ’ మూవీ కోసం త్రిపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. అలాగే.. బాబాయ్ బాలయ్య సైతం ‘అధినాయకుడు’ సినిమాలో ట్రిపుల్ రోల్స్ చేశారు. ఇక తాత నందమూరి తారకరామారావు సైతం ‘కులగౌరవం’ సాంఘిక చిత్రంలోనూ, ‘దానవీరశూరకర్ణ’ పౌరాణిక చిత్రంలోనూ త్రిపాత్రలు పోషించారు. ఇక ‘శ్రీమద్విరాట్ పర్వం’ లో ఏకంగా ఐదు పాత్రలు పోషించారు. సో.. ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో సహా నందమూరి వారి ఫ్యామిలీలో అందరూ త్రిపాత్రాభినయం చేసినట్టే. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో చూడాలి.
Must Read ;- బోయపాటి శీను నెక్స్ట్ మూవీ ఆ హీరోతోనా?











