సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ ల కలయికలో సినిమా విషయంలో స్పష్టత వచ్చేసింది. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజైన మే 31న పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. హారిక హాసిని సంస్థ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ వార్తను శనివారం సాయంత్రం 4 గంటలకు అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నా ఆలస్యం కావడంతో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక వార్త వచ్చేసింది. మహేష్ బాబుకు ఇది 28వ చిత్రం అవుతుంది. వీరిద్దరి కాంబినేషన్ లో 16 ఏళ్ల క్రితం మొదటిసారిగా ‘అతడు’ విడుదలై ఘనవిజయం సాధించింది.
ఆ తర్వాత ‘ఖలేజా’ రూపొందింది. మళ్లీ 11 ఏళ్ల తర్వాత వీరి సినిమా పట్టాలెక్కబోతోంది. ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారువారి పాట’ సినిమా చేస్తున్నారు. దీన్ని వచ్చే ఏడాది జనవరికి విడుదల చేస్తారు. త్రవిక్రమ్ దర్శకత్వంలోని సినిమాను వచ్చే ఏడాది వేసవికి విడుదలయ్యేలా ప్లాన్ చేశారు. దీనికి తమన్ సంగీతం సమకూర్చే అవకాశం ఉంది. త్రివిక్రమ్, తమన్ ల కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవుతోంది. గత ఏడాది జనవరిలో ‘అల వైకుంఠపురములో’తో పెద్ద హిట్ కొట్టారు. అదే సమయంలోనే దీనికి పోటీగా మహేష్ బాబు సరిలేరు మీకెవ్వరు విడుదలైంది. త్రివిక్రమ్ తో చేసే సినిమా పూర్తయిన తర్వాతే మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేసే అవకాశం ఉంది.
ఈ విషయంలో రాజమౌళి నుంచి క్లారిటీ వచ్చాకే మహేష్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. సాధారణంగా రాజమౌళి స్క్రిప్టుకు ఎక్కువ సమయం తీసుకుంటారు. అందువల్ల మధ్యలో ఓ సినిమా చేసేయటానికి మహేష్ సిద్ధమయ్యారు. పైగా ఇది ముందుగా అనుకున్న ప్రాజెక్టే. ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలన్నీ త్వరలోనే వెల్లడవుతాయి. ఈ చిత్రానికి సమర్పణ: శ్రీమతి మమత, నిర్మాత: సూర్యదేవర రాధాకృష్ణ(చినబాబు), రచన, దర్శకత్వం: త్రివిక్రమ్.
Must Read ;- సూపర్’ న్యూస్ ని ఎందుకిలా చేశారు?











