ఏప్రిల్ 28 అంటేనే దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుకు ప్రత్యేకమైన రోజు. ప్రచారాలకు దూరంగా ఉండే ఆయన ఆరోజు మాత్రం ఏదో ఒక రూపంలో స్పందిస్తూనే ఉంటారు. ఈసారి కూడా ఆయన స్పందించబోతున్నారు. ఇక ఆరోజు రాఘవేంద్రరావుకు ఎందుకు ప్రత్యేకమైన రోజంటే అది ‘అడవిరాముడు’ సినిమా విడుదలైన రోజు.
కమర్షియల్ సినిమాకు కేరాఫ్ అడ్రస్ అంటే రాఘవేంద్రరావు సినిమానే చెప్పాలి. ఒకవిధంగా దానికి నాంది పలికింది కూడా అడవిరాముడే. అంత భారీతనం ఆ సినిమాలో కనిపిస్తుంది. నటరత్న నందమూరి తారకరామారావు సినీ జీవితంలో అడవిరాముడు సాధించిన రికార్డును మరే సినిమా సాధించలేకపోయింది. తెలుగు సినిమా రికార్డులనన్నింటినీ తిరగరాసిన సినిమా ఏదంటే అడవిరాముడు అనే చెప్పాలి. ఎన్టీఆర్, కె. రాఘవేంద్రరావుల కలయికలో వచ్చిన మొదటి సినిమా అది. అంతేకాదు హీరోయిన్లుగా జయప్రద, జయసుధలకు ఎన్టీఆర్ తో నటించడం కూడా అదే మొదటిసారి.ఎనిమిది కేంద్రాల్లో ఏడాది పాటు ఆడిన సినిమా అది. 35 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. ఇలాంటి రికార్డులు అడవిరాముడుకే సొంతం.
కేవీ మహదేవన్ సంగీతంతో మ్యూజికల్ గానూ మ్యాజిక్ చేసిన సినిమా అది. ఇందులోని పాటలన్నిటినీ వేటూరి సుందరరామ్మూర్తి రాశారు. కె. రాఘవేంద్రరావు సినిమాకు పాటలు రాయడం వేటూరికి కూడా ఇదే మొదటిసారి. మాస్ మసాలా పాటలకు వేటూరి ఈ సినిమాతోనే శ్రీకారం చుట్టారనుకోవాలి. ఎన్టీఆర్ నటించిన మొదటి సినిమా స్కోప్ చిత్రం కూడా ఇదే. సత్యచిత్ర పతాకంపై సూర్యనారాయణ, సత్యనారాయణ దీన్ని నిర్మించారు. కన్నడ రాజ్ కుమార్ నటంచిన ‘గందద గుడి’ సినిమా దీనికి ఆధారం. అయితే ఎన్టీఆర్ ఇమేజ్ కు తగ్గట్టుగా రాఘవేంద్రరావు కథలో చాలా మార్పులు చేశారు. అప్పటిదాకా ఉన్న నందమూరి తారక రామారావు ఇమేజిని మార్చిన సినిమాగానూ చెప్పవచ్చు.
Also Read ;- తెలుగులో మళ్లీ రాబోతున్న‘మాతృదేవోభవ’ సినిమా
షూటింగ్ ఎప్పుడు ప్రారంభం?
సత్యచిత్ర సంస్థకు సినిమా చేయడానికి ఎన్టీఆర్ అంగీకరించడం కూడా విశేషమే. అప్పటికే సత్యచిత్ర సంస్థ శోభన్ బాబు హీరోగా ‘తాసిల్దారుగారి అమ్మాయి’ నిర్మించింది. ఆ తర్వాత ‘ప్రేమబంధం’ నిర్మించింది. మూడో సినిమాగా ‘అడవిరాముడు’ కోసం డేట్స్ అడిగితే ఎన్టీఆర్ ఇచ్చారు. అయితే అనుకోకుండా ఎన్టీఆర్ దానవీరశూర కర్ణ’ సినిమా చేయాల్సి వచ్చింది. పైగా ఆ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలనుకోవడంతో అడవిరాముడును పక్కన పెట్టారు. దానవీరశూర కర్ణ పూర్తయిన వెంటనే బల్క్ డేట్స్ సత్యచిత్ర సంస్థకు ఇచ్చారు. 1977 జనవరి 9న మద్రాసులోని ఓ హోటల్ లో ‘అడవిరాముడు’ షూటింగ్ ప్రారంభమైంది.
‘భరతమాత బిడ్డగా విద్యుక్తధర్మాన్ని నిర్వర్తాను’ అని ఎన్టీఆర్ ముహూర్తపు షాట్ లో తొలి డైలాగ్ చెప్పారు. ఈ సన్నివేశం మినహా మిగతా సినిమా అంతా అవుట్ డోర్ లోనే తీశారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్న మధుమలై అటవీ ప్రాంతంలో షూటింగ్ చేశారు. దాదాపు 35 రోజుల పాటు అడవుల్లోనే ఎన్టీఆర్ మీద సన్నివేశాలు చిత్రీకరించారు. మొత్తం చిత్ర యూనిట్ లో 350 మంది ఉండేవారు. వారి కోసం ప్రత్యేకంగా కాటేజీలు నిర్మించారు నిర్మాతలు. అడవిలోనే భారీగా సెట్స్ నిర్మించాల్సి వచ్చింది. ఎంతోమంది వీటి కోసం శ్రమించారు. ఏ విషయంలోనూ నిర్మాతలు రాజీ పడలేదు. పైగా ఎన్టీఆర్ లాంటి మహానటుడితో సినిమా తీస్తున్నారు కాబట్టి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడే జనం కథలు కథలుగా సినిమా గురించి చెప్పుకునేవారు. పైగా అప్పట్లో ఇప్పట్లా సోషల్ మీడియా లేదు. పత్రికల్లోనే సినిమా కవరేజి వచ్చేది. మద్రాసు చిత్రా సర్కస్ కు చెందిన మూడు ఏనుగులను ఈ సినిమా కోసం వినియోగించారు. హీరోయిన్లకు రెండు ప్రమాదాలు కూడా జరిగాయి. ఏనుగుల మీద కూర్చున్న జయప్రద, జయసుధలను ఏనుగులు కింద పడేశాయి. జయప్రద అయితే ఏకంగా స్పృహతప్పిపోయింది. ఆ తర్వాత రోజు కూడా మరో ప్రమాదం. ఘాట రోడ్డు మీద వెళుతుంటే టాంగా చక్రం ఊడిపోవడంతో జయప్రద కింద పడిపోయింది. ఆమె పక్కటెముకలకు దెబ్బలు తగిలాయి.
ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ఎన్టీఆర్ కాస్ట్యూమ్స్. విజయవాడలో యాక్స్ టైలర్ వాలేశ్వరరావు ఎన్టీఆర్ దుస్తులు తయారు చేశారు. ఆ దుస్తులు కూడా జనంలోకి బాగా వెళ్లాయి. అప్పట్నుంచి ఎన్టీఆర్ చాలా సినిమాలకు వాలేశ్వరరావే దుస్తులు కుట్టారు. యాక్స్ టైలర్ సంస్థకు కూడా మంచి పేరొచ్చింది. 1977 ఏప్రిల్ 28న ‘అడవిరాముడు’ విడుదలైంది. 40 ప్రింట్లతో ఈ సినిమా విడుదలైంది. జనానికి సరికొత్త ఎన్టీఆర్ ను చూపించిన సినిమా ఇది. ఈ సినిమాలో ఏనుగులు చేసే ఫీట్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా మారాయి. భారీ క్లైమాక్స్ లకు ఈ సినిమాయే మార్గదర్శకం అని కూడా చెప్పాలి.
కెమెరామన్ విన్సెంట్ కెమెరా పనితనం కూడా ఈ సినిమాలోని మరో ప్రత్యేకతగా చెప్పాల్సి ఉంటుంది. తెలుగు నాట ‘షోలే’ రికార్డులను బ్రేక్ చేసిన సినిమాగానూ అడవిరాముడు ను చెప్పాల్సి ఉంటుంది. ఈ సినిమా 200 రోజుల వేడుక మద్రాసులోని కోరమాండల్ హోటల్ లో జరిగింది. ముఖ్యఅతిథిగా రాజ్ కపూర్ హాజరయ్యారు. 100 రోజుల వేడుకకు దిలీప్ కుమార్ హాజరయ్యారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ – రాఘవేంద్రరావు కాంబినేషన్ లో 11 సినిమాలు రూపొందాయి. దాదాపు అన్నీ హిట్లే. అందుకే దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ జీవితంలో ఏప్రిల్ 28 ఓ ప్రత్యేకమైన రోజు.
ఈసారి రాఘవేంద్రరావు ఏంచేయబోతున్నారు?
ఈ ఏడాది ఏప్రిల్ 28న రాఘవేంద్రరావు ప్రేక్షకులకు ఓ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఆయన పాతికేళ్ల క్రితం రూపొందించిన ‘పెళ్లిసందడి’ సినిమా పేరుతో పోలిక ఉండేలా మరో సినిమాకి ఆయన దర్శకత్వ పర్యవేక్షణ చేస్తుస్తున్న సంగతి తెలిసింది. ఇందులో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో. దీని పేరు ‘పెళ్లిసంద.. డి’. గౌరి రోనంకి దర్శకత్వంలో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని దీన్ని నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. దీని షూటింగ్ దాదాపు పూర్తయింది.
ఈ సినిమాలోని ఓ పాటని ఈ నెల 28న విడుదల చేయబోతున్నారు. కె. రాఘవేంద్రరావు సమర్పణలో రూపొందిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ విడుదలైంది కూడా ఏప్రిల్ 28నే. అందుకే ‘పెళ్లిసంద…డి’ పాటను ఆ రోజున విడుదల చేయాలని సంకల్పించారు. ఈ సినిమా ‘పెళ్లి సందడి’కి సీక్వెల్ మాత్రం కాదట. 1975లో ‘బాబు’ సినిమాతో ప్రారంభమైన రాఘవేంద్రరావు పయనం ‘అడవిరాముడు’తో తారాపథానికి చేరింది. తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి చేరేలా బీజం వేసింది కూడా అడవిరాముడే నాంది పలికింది. తెలుగు సినిమాకి అంతటి భారీతనాన్ని తెచ్చిన సినిమా అడవి రాముడు.
-హేమసుందర్
Must Read ;- తెలుగు సినిమాకు ‘పూర్ణోదయ’ వెలుగులు