జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ ఏపీ కోసం కాక వైసీపీ కోటరీ కోసమే అనేట్లుగా ఉందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శించారు.జగన్ ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి మరో చేత్తో 100 రూపాయలు లాగేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పరవాలేదు, తమ పార్టీ నాయకులు బాగుంటే చాలు అనేది జగన్ ఎజెండా అని..రాష్ట్ర బడ్జెట్ చూస్తే నిజంగా అదే ఆలోచనతోనే రూపొందించినట్లుగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజల్ని ఇంతలా మోసం చేస్తున్న ఆయన జగన్ మోహన్ రెడ్డి కాదు జగన్ మోసపు రెడ్డి అని ఆయన ఎద్దేవా చేశారు.
వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ సర్కార్ బడ్జెట్ లో పొందుపరిచిన అంశాలకు ఎక్కడా పొంతన లేని విధంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక బడ్జెట్ లో పేర్కొన్న స్కీంలు అన్నీ అబద్ధమని.. వైకాపా పాలనలో జరుగుతున్న స్కాంలు మాత్రమే నిజమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆరోపించారు.జగన్ ఈ బడ్జెట్ ని ఏపీ కోసం కాక వైసీపీ కోటరీ కోసమే రూపొందించినట్లుగా ఉందని ఆయన విమర్శించారు.అందరూ బాగుండాలి అనేది చంద్రబాబు విధానంగా ఉంటే.. కేవలం వైసిపి కోటరీ బాగుండాలి అనేది జగన్ రెడ్డి ఎజెండాగా పెట్టుటకున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గవర్నర్ ప్రసంగంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం కేటాయించిన నిధుల ప్రత్యేక ప్రస్తావన పొందుపరచని ప్రభుత్వం, బడ్జెట్‌లోనూ ఆ ప్రస్తావన లేకుండా మోసగించిందన్నారు. కులాలవారీగా కార్పొరేషన్లు పెట్టామని గొప్పలు చెప్పుకుంటున్న జగన్ సర్కార్ వాటికి రూపాయి కూడా నిధులివ్వలేదని..కార్పొరేషన్ పాలకవర్గం కూర్చునేందుకు కుర్చీ కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.
వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చీకటి బడ్జెట్ అని “అమ్మ ఒడి అబద్ధం – నాన్నబుడ్డీ నిజం”, “వాహన మిత్ర అబద్ధం – ఆటోడ్రైవర్లని మోసం చేయడం నిజం” అంటూ లోకేష్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో విద్యార్థినులకు సైకిళ్లు ఇస్తే జగన్ ప్రభుత్వం దానిని నిలుపుదల చేయడం పై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో బెస్ట్ ఎవైలబుల్ స్కూళ్లు మూసేసిన వైసీపీ ప్రభుత్వం, ఎయిడెడ్ పాఠశాలలను పూర్తిగా చంపేసిందని మండిపడ్డారు.
అవ్వాతాతలకు ఇచ్చే పింఛను విషయంలోనూ జగన్ సర్కార్ వంచనకి పాల్పడిందని లోకేష్ విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే పెన్షన్ మూడువేలు ఇస్తామని హామీ ఇచ్చి మోసగించారన్నారు. వైఎస్, ఆయన కొడుకు కలిపి ఇచ్చిన పింఛను 625 రూపాయలు అయితే, అవ్వాతాతలపై ఉన్న ప్రేమతో ఎన్టీఆర్, చంద్రబాబు 1850 రూపాయల పెన్షన్ ఇచ్చారని స్పష్టం చేశారు. పాదయాత్రలో 45 ఏళ్లు దాటిన వాళ్లందరికీ పింఛను ఇస్తామని చెప్పిన జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇవ్వకుండా మహిళల్ని మోసం చేసారని అన్నారు.
ప్రభుత్వం చెప్పిన పేదలకు ఇళ్ళు అనే స్కీం వెనుక 7 వేల కోట్ల స్కాం ఉందని లోకేష్ ఆరోపించారు. లక్షల ఇళ్లు కట్టామని ప్రభుత్వ పెద్దలు చెప్తునవన్నీ అవాస్తవాలేనని, కేంద్రం వెల్లడించిన లెక్కల ప్రకారం జగన్ సర్కార్ మూడేళ్లలో కేవలం 5 ఇళ్లు మాత్రమే కట్టిందని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే దశలవారీగా మద్యనిషేధం చేస్తామని హామీ ఇచ్చిన జగన్..ఇప్పుడు మద్యం ఆదాయంపైనే ఆధారపడుతున్నారని విమర్శించారు.టిడిపి హయాంలో ఆబ్కారీపై ప్రభుత్వానికి 6 వేల కోట్లు ఆదాయం వస్తే,
జగన్ రెడ్డి మద్యంపై 16,500 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారన్న లోకేష్ మందుబాబుల్ని తాకట్టుపెట్టి 25 వేల కోట్లు అప్పు తీసుకున్నాడన్నారు.
చేనేతలకి 3.50 లక్షల మగ్గాలుంటే కేవలం 80 వేల మందికి నేతన్న నేస్తం ఇచ్చి జగన్ ప్రభుత్వం మోసగించిందన్నారు. మూడేళ్లలో 25 మంది చేనేత కళాకారులు ఆత్మహత్యలకు పాల్పడితే ప్రభుత్వం ఆదుకోవడం కాదు కదా…కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. 16 లక్షల మంది విద్యార్థులకు చంద్రబాబు ఒకేసారి ఫీజులు రీయింబర్స్ మెంట్ ఇస్తే.. జగన్ మూడు నాలుగు విడతలుగా ఇస్తూ విద్యార్థుల్ని ఆందోళనకి గురిచేస్తున్నారు.ఇక బడ్జెట్‌లో విదేశీ విద్య ప్రస్తావనే కూడా లేకపోవడాన్ని లోకేష్ తప్పుబట్టారు. టిడిపి హయాంలో ఉన్నత చదువుల కోసం 3 వేల మంది విదేశాలు వెళ్లారని అయితే..వైసీపీ ప్రభుత్వం ఏర్పాడ్డాక జగన్ చేసిన మోసంతో వారంతా అక్కడ ఇరుక్కుపోయారని అన్నారు.
ఇక జగన్ పాలనలో ఆరోగ్యశ్రీలో వెయ్యి దాటిన అన్నింటికీ ఉచితవైద్యం అని హామీ ఇచ్చిన జగన్‌రెడ్డి ఆస్పత్రులకు బకాయిలు చెల్లించడం లేదని లోకేష్ తెలిపారు. దీంతో ఆరోగ్యశ్రీ పేరు చెబితే ఆసుపత్రుల్లో అసలు వైద్యమే చేయడంలేదని అన్నారు.
బడుగుబలహీన వర్గాలంటే జగన్ ప్రభుత్వానికి చిన్నచూపుని అందుకే వార్షిక బడ్జెట్ లో ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ కోసం బడ్జెట్‌లో నిధుల కేటాయింపు చేయలేదని అన్నారు. అదేసమయంలో సబ్ ప్లాన్ నిధులను కూడా ఈ ప్రభుత్వం మళ్లించేశారని గుర్తుచేశారు.
బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్, క్రిష్టియన్ కార్పొరేషన్, మైనారిటీల సంక్షేమానికి, ఎస్సీ కార్పొరేషన్ లకు వందల కోట్లు కేటాయించాం అనే చెప్పుకుంటున్న ప్రభుత్వం ఖర్చు చేసింది ఏమీ లేదన్నారు.
మొత్తం మీద జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ కేటాయింపులకు ఖర్చులకు ఎక్కడా పొంతన లేకుండా చీకటి బడ్జెట్ ని తలపిస్తోందని , కేవలం కాగితాల ప్రకటనలకే బడ్జెట్ పరిమితమవుతోంది తప్ప ఎక్కడా రాజ్యాంగ బద్ధంగా లేదని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.అదేసమయంలో గత బడ్జెట్ లో దోచిందెంత, దాచిదెoతో వైసీపీ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Must Read:-వైసీపీ పై ఒక రేంజ్ లో రెచ్చిపోయిన జగన్ అభిమాని | Jagan Fan Fires on YSRCP Government | Leo News