ఏపీలో అధికారంలోని వైసీపీ ప్రభుత్వానికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇతరత్రా విషయాలను అలా పక్కనపెడితే… హైకోర్టుకు చేరుతున్న దాదాపుగా ప్రతి అంశంలోనూ జగన్ సర్కారుకు మొట్టికాయలు పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరో మొట్టికాయ… అంతకంటే కూడా కాస్తంత గట్టిగానే దెబ్బ తగిలే అవకాశాలున్నాయన్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా కొనసాగుతున్న నీలం సాహ్నికి… గతంలో అదే పదవిలో జగన్ సర్కారు నియమించిన జస్టిస్ కనగరాజ్ మాదిరే డకౌట్ అయ్యే ప్రమాదం పొంచి ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
స్వామి భక్తితో ఎస్ఈసీగా నీలం
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జగన్ ఏరికోరి నియమించుకున్న నీలం సాహ్ని… నిబంధనలను తోసిరాజని జగన్ చెప్పినట్టే నడుచుకున్నారు. చట్టబద్ధ సంస్థ అయిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ తో డీ అంటే డీ అన్నారు. వెరసి హైకోర్టు చేతిలో పలుమార్లు మొట్టికాయలు తిన్నారు. అయితే జగన్ దగ్గర పనిచేసిన నేపథ్యంలో ఆయన మాదిరే మారిపోయినట్లుగా కనిపించిన నీలంకు ఐఏఎస్ గా పదవీ విరమణ చేయగానే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి దక్కింది. ఈ క్రమంలో నీలం కూడా జగన్ మాదిరే దూకుడుగా వెళ్లారు. వచ్చీరాగానే పరిషత్ ఎన్నికలంటూ హడావిడి చేశారు. పోలింగ్ కూడా నిర్వహించారు. అయితే హైకోర్టు ఆమె నిర్ణయాలను తప్పుబడుతూ… నిబంధనలు పాటించకుండా పోలింగ్ ఎలా నిర్వహిస్తారంటూ పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ను నిలిపివేసి షాకిచ్చింది.
వేటు తప్పదా?
ఇక తాజా అంశమేమిటంటే.. ఎస్ఈసీ పదవి నుంచి జస్టిస్ కనగరాజ్ ఎలాగైతే పదవీచ్యుతి పొందారో.. అదే మాదిరిగా ఇప్పుడు నీలం మెడపైనా పదవీ గండం వేలాడుతోందని చెప్పాలి. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన ఓ పిటిషన్ పై హైకోర్టు ఇప్పటికే రెండు పర్యాయాలు విచారణ చేపట్టింది. సోమవారం రెండో దఫా విచారణ సందర్భంగా కోర్టు కోరిన అదనపు సమాచారాన్ని అందజేయడానికి కొంత సమయం కావాలంటూ పిటిషనర్ కోరడంతో కోర్టు ఈ విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. కోర్టులో జరుగుతున్న పరిణామాలు, పిటిషనర్ లేవనెత్తిన అంశాలను బట్టి చూస్తుంటే… నీలం సాహ్ని కూడా ఎస్ఈసీ పదవి నుంచి తప్పుకోక తప్పదన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Must Read ;- ఎస్ఈసీ నీలం సాహ్నికి హైకోర్టు నోటీసులు