వెంకటేశ్ కథానాయకుడిగా ‘నారప్ప’ సినిమా రూపొందుతోంది. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆ మధ్య తమిళంలో భారీ విజయాన్ని సాధించిన ధనుశ్ మూవీ ‘అసురన్’కి ఇది రీమేక్. కుటుంబ బంధాలు .. అనుబంధాల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. కలైపులి థాను .. సురేశ్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కోసం వెంకీ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి కానుకగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను వదిలారు.
కుటుంబంలోని బలమైన బంధాలకు సంక్రాంతి పండుగ నిలువెత్తు నిదర్శనం. అందువలన ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కథలనే సంక్రాంతికి థియేర్లకు తీసుకురావడానికి దర్శక నిర్మాతలు ఉత్సాహాన్ని చూపుతుంటారు. సురేశ్ ప్రొడక్షన్స్ వారు పోస్టర్ రిలీజ్ విషయంలోనూ ఆ పద్ధతిని పాటించారు. ‘నారప్ప’ ఫ్యామిలీని పరిచయం చేస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. ‘నారప్ప’ తన భార్యాబిడ్డలతో పొలం గట్లపై సంతోషంగా ఉన్న పోస్టర్, పండుగ వాతావరణాన్ని ప్రతిబింబిస్తోంది. తన పల్లె .. తన ఇల్లు .. తన నేల అనే ఆనందం కథానాయకుడికి ఏ స్థాయిలో ఉందనేది ఈ పోస్టర్ చెబుతోంది.
వెంకటేశ్ భార్యగా ప్రియమణి నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇది సత్తా కలిగిన కథ అనే విషయం ఆల్రెడీ రుజువైంది. ఇక వెంకటేశ్ తదితరులు ఎలా చేశారనేదే ఈ సినిమా సక్సెస్ పర్సెంటేజ్ ను పెంచనుంది. వెంకటేశ్ కెరియర్లోనే ఇది చెప్పుకోదగిన సినిమా అవుతుందని అభిమానులు అంటున్నారు. ఈ ఏడాదిలో ఈ సినిమా వెంకటేశ్ కి తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.