నాగార్జునసాగర్ ఉప ఎన్నికలతో అన్ని పార్టీల్లో టెన్షన్ పుట్టింది. నాగార్జునసాగర్ అధికార టీఆర్ఎస్‌కు సిట్టింగ్ స్థానం కాగా.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి సొంత నియోజకవర్గం. దీంతో ఇక్కడ ఈ రెండు పార్టీలు హోరాహోరీగా పోరాడే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ సైతం నాగార్జునసాగర్‌లో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తోంది. ఆర్టీఐ కింద బీజేపీ వివరాలు సేకరించి ప్రభుత్వ వైఫ్యలాలను ఎండగట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. నియోజకవర్గ నాయకులకు సంబంధం లేకుండా రాష్ట్ర స్థాయి నాయకులే సమాచారం సేకరిస్తున్నారు.
ఇద్దరు నేతల పోటాపోటీ ప్రచారం…
గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నివేదితారెడ్డి తానే నియోజకవర్గ ఇన్‌చార్జినంటూ ప్రచారం సాగిస్తున్నారు. రాష్ట్ర స్థాయి నేతల అండ తమకు ఉందని, తనకే బీజేపీ టికెట్ వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. జన సమీకరణలు చేస్తూ .. ర్యాలీలు నిర్వహిస్తూ నియోజకవర్గంలో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రచార రథాలు, మైక్‌సెట్లతో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన పరిస్థితులను తలపించేలా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు టీడీపీ నుండి వచ్చిన అంజయ్య యాదవ్ సైతం నాగార్జునసాగర్‌లో బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. మంది మార్భలంతో ఆయన సైతం ప్రచార కార్యక్రమాలు ఉధృతం చేశారు. దీంతో ఇద్దరు నేతల పోటాపోటీ ప్రచారం తమకు లాభిస్తుందని బీజేపీ భావిస్తోంది.
మూడో వ్యక్తి రాబోతున్నారా…
అయితే,వీరిద్దరూ గత ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదని బీజేపీ అదిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుండి బలమైన నేత జానారెడ్డి బరిలో ఉంటున్ననేపథ్యంలో తమ పార్టీ నుండి సైతం ఆర్థిక, అంగ బలం ఉన్న వారిని రంగంలోకి దింపాలని బిజేపీ భావిస్తోంది. దీంతో బీజేపీ నేతలు గెలుపు గుర్రాల కోసం వెతుకులాట మొదలెట్టారు. ఇతర పార్టీల నేతలు కొందరు తమ పార్టీ వైపు చూస్తున్ననేపథ్యంలో వారిలో ఎవరినైనా ఎన్నికల బరిలో దింపితే ఎలా ఉంటుందన్న దానిపై కూడా అధిష్టానం సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం.
Must Read ;- టీకాంగ్రెస్ : అసలే ముక్కిడి.. ఆపై పడిశం!