గుప్త నిధులు, లంకె బిందెలు..ఈ మాటలు వినగానే పాత సినిమాలు గుర్తుకొస్తాయి. పూర్వకాలంలో ఇలాంటివి బయటపడేవని పెద్దలు చెబుతుంతారు. ఇప్పటికీ కొన్ని చోట్ల ఇలాంటి నిధులు బయటపడుతున్నాయి. తాజాగా జనగామ జిల్లాలో ఈ నిధులు బయట పడ్డాయి. హైదరాబాద్‌కు చెందిన నర్సింహయాదవ్ ఓ వైపు వ్యవసాయం చేస్తూ..స్థిరాస్తి వ్యాపారం కూడా చేస్తుంటారు. జనగామ జిల్లా పెంబర్తి గ్రామ పరిధిలో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి సమీపంలో ఓ రైతు నుంచి 11 ఎకరాల వ్యవసాయ భూమిని కొన్నారు. వెంచర్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా లెవెలింగ్ చేస్తుండగా జేసీబికు భూమిలో ఉన్న వస్తువు తగిలింది. ఆ వస్తువును పరిశీలించి బలంగా లాగడంతో ఓ బిందె బయటపడింది. జేసీబితో లాగడంతో బిందె పగిలింది. అందులో బంగారు, వెండి ఆభరణాలు బయటపడ్డాయి. అమ్మవారి పుస్తెలు, మెట్టెలు, కడేలు, గాజులు ఉండడంతో అంతా షాక్ తిన్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెవెన్యూ, పురావస్తు శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు చేరుకుని ఆ ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా నర్సింహ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా తనకు కలలో అమ్మవారు కనిపిస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే తన భూమిలో అమ్మవారి గుడి కట్టించాలని నిర్ణయించుకున్నట్లు వ్యాఖ్యానించాడు. కాగా లంకె బిందెలో 11 తులాల బంగారంతో పాటు 10 కిలోల వెండి లభించిందని అధికారులు వెల్లడించారు. ఇవి ఏ కాలంనాటి నిధి అనే అంశంపై పరిశోధించాల్సి ఉందన్నారు. అమ్మవారి నగలు కావడంతో.. అమ్మవారికే చెందాలని కూడా కొందరు గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణలో గతంలోనూ..
కాగా తెలంగాణలోని నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడా నిధులు బయటపడడం గతంలోనూ జరిగింది. 2019లో వికారాబాద్ జిల్లాలో గుప్త నిధులు బయటపడ్డాయి. జిల్లాలోని ఎర్రగడ్డపల్లికి చెందిన చెందిన రైతు యాకూబ్ అలీ పొలం దున్నుతున్న క్రమంలో కొన్ని పాత్రలు బయటపడ్డాయి. మరింత లోతుకి తవ్వగా ఆభరణాలుకూడా లభించాయని చెబుతారు. అయితే అధికారికంగా కొన్ని రాగి పాత్రలు లభించినట్టు మాత్రమే తేలింది. కొన్నాళ్ల క్రిత్రం ఉత్తరప్రదేశ్‌లోని హార్దోయిలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం పునాది తవ్వుతుండగా బంగారు నిధి దొరికింది. దాదాపు అందులో 650 గ్రాముల బంగారం,4.53కేజీల వెండి లభించింది.
తమిళనాడులో..
ఇక తమిళనాడులో గత ఏడాది ఫిబ్రవరిలో భారీ సంఖ్యలో బంగారు నాణేలు లభించాయి. తిరుచ్చి జిల్లాలోని జంబుకేశ్వరార్ అఖిలాండేశ్వరి ఆలయ పునరుద్ధరణ పనులు చేస్తుండగా ఓ కుండ బయటపడింది. అందులో 505 బంగారు నాణేలు లభించాయి. వాటి బరువు ఒక 1716 గ్రాములు ఉంటుందని అధికారులు తేల్చారు. అరబిక్‌లో నాణేలపై ముద్ర ఉండడంతో పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే తాజాగా జనగామ ప్రాంతంలో లభించిన నిధి అమ్మవారికి సంబంధించింది కావడంతో కాకతీయుల కాలం నాటిది కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నిధి దొరికిన ప్రాంతం చుట్టూ పోలీసులు నిఘా పెట్టారు. రెండు రోజుల్లో పురావస్తు శాఖకు చెందిన ప్రత్యేక టీం వచ్చి వీటిపై పరిశోధన చేస్తుందని, చుట్టుపక్కల కూడా నిధులు ఉండే అవకాశం ఉండడంతో నిఘాను పటిష్టం చేసినట్టు అధికారులు చెబుతున్నారు.
Must Read ;- ఆహా ఏమి రుచి : ఏపీ స్వీట్స్.. సూపర్ టేస్ట్!
Narasimha from Pembarthy, Janagam district in #Telangana has struck a pot of gold! Literally! He bought a 11 acre land last month& while getting it leveled today, found a pot of gold. He thinks the gold belongs to the goddess and would build a temple there. #LuckyThursday pic.twitter.com/J9J1mw5MyO
— Revathi (@revathitweets) April 8, 2021