కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలంలోని తరిమిశలో పేకాట శిబిరాలపై 100 మందికి పైగా ప్రత్యేక పోలీసులు దాడి చేసి 62 మందిని అరెస్టు చేయడం సంచలనం సృష్టిస్తోంది. సాక్షాత్తూ మంత్రి ఇలాకాలో ఇలా పేకాట శిబిరాలను పెద్ద ఎత్తున నిర్వహించడంపై సీఎం జగన్మోహన్‌రెడ్డి సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. వెంటనే మంత్రి కొడాలి నానిని తాడేపల్లి సీఎం నివాసానికి పిలిపించారు. దీంతో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాలు రద్దు చేసుకుని కొడాలి నాని తాడేపల్లి చేరుకున్నారు. అక్కడ మీడియాతో మాట్లాడి మరోసారి సెల్ప్ గోల్ చేసుకున్నారు.
పేకాట ఆడితే ఉరి శిక్ష వేస్తారా?
నా అనుచరులు పేకాట ఆడితే ఉరిశిక్ష వేస్తారా? అంటూ తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడిన మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. పేకాట ఆడితే ఏమవుతుంది. కేసు పెడతారు? కోర్టులో ఫైన్ కట్టి బయటకు వచ్చి మరలా పేకాట ఆడుకుంటారన్న మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇలా ఒక మంత్రి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటంపై ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పేకాటను ఎవరు ఆపినా ఆగదని మంత్రి కొడాలి వ్యాఖ్యానించారు. ఒకచోట అరెస్టు చేస్తే మరోచోట శిబిరాలు పెట్టి పేకాట ఆడుకుంటారని కొడాలి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి.
పవన్ విమర్శలు చేసిన వెంటనే..
మంత్రి కొడాలి వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉంటున్నాయని సీఎం జగన్మోహన్‌రెడ్డి భావిస్తున్నారనే వాదనలు వినవస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేలు పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు చేసిన వారంలోనే గుడివాడ సమీపంలో పేకాట శిబిరాలపై పోలీసులు దాడి చేయడం సంచలనంగా మారింది. అయితే, ఇది కేవలం ఒక్క గుడివాడకే పరిమితం కాదని, పేకాట అన్ని జిల్లాలకు విస్తరించిందనే వాదన వినిపిస్తోంది.
Also Read: మంత్రి నానిపై దాడి కేసులో మాజీ మంత్రి విచారణ