గుంటూరు జిల్లాలో మూడు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. పార్లమెంటు స్థానాల ఆధారంగా జిల్లాలను ఎంపిక చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. అంటే గుంటూరు జిల్లాలో బాపట్ల, గుంటూరు, నరసరావుపేట మూడు జిల్లాలు కానున్నాయి. అయితే నరసరావుపేటలో జిల్లా కేంద్రం ఏర్పాటుపై పల్నాటి ప్రజలు రగిలిపోతున్నారు.
పల్నాడు కేంద్రంగా గురజాలలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని పల్నాటి ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. తాజాగా నరసరావుపేట కేంద్రంగా పల్నాటి జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు అవసరమైన భవనాల కోసం జిల్లా ఉన్నతాధికారులు నరసరావుపేట లింగంగుంటలోని 20 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. దీంతో నరసరావుపేటలో జిల్లా కేంద్రం ఏర్పాటు అవుతుందని పల్నాటి ప్రజలు రగలిపోతున్నారు. పల్నాడులో కొన్ని గ్రామాల ప్రజలకు నరసరావుపట 86 కిలోమీటర్ల దూరంలో ఉంది. గతంలో గుంటూరు జిల్లా కేంద్రం చాలా దూరం అయిపోయిందని పల్నాడును గురజాల కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని ఉద్యమాలు చేశారు. తాజాగా జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఎలాగూ మొదలైంది కాబట్టి ఈ ఉద్యమం మరింత తీవ్రం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వైసీపీకి తలనొప్పులు
నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు చేస్తే గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో వైసీపీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. చరిత్రను పరిశీలిస్తే నరసరావుపేట పల్నాడు ప్రాంతంలోకి రాదు. గురజాల, మాచర్ల నియోజకవర్గాలను మాత్రమే పల్నాడుగా భావిస్తూ ఉంటారు. పల్నాటి ప్రజలు అన్ని అవసరాలకు నరసరావుపేటపై ఆధారపడాల్సి రావడంతో ఇక్కడకు వారిరాకపోకలు ఎక్కువగా సాగుతుంటాయి. దీంతో నరసరావుపేట కూడా పల్నాడే అన్న చందంగా తయారైంది. తాజాగా ప్రభుత్వం కూడా నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలను జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు ప్రారంభించడంతో గురజాల, మాచర్ల నియోజకవర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు.
గురజాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ఉద్యమ సంఘాలను ఏర్పాటు చేసుకుని ప్రత్యక్ష కార్యాచరణకు సిద్దం అవుతున్నారు. దీంతో వైసీపీ నేతలకు కొత్త తలనొప్పులు వచ్చిపడ్డాయి. నరసరావుపేట కేంద్రంగా పల్నాటి జిల్లాను ఏర్పాటు చేస్తే గురజాల, మాచర్లలో వైసీపీకి గడ్డు పరిస్థితులు తప్పేలా లేవు.
AlsoRead ;- భౌగోళిక పరిస్థితులతోనే జిల్లాల ఏర్పాటు మేలు.. నేతల, నిపుణుల అభిప్రాయం
సమానదూరం పాటించరా
కొత్తగా ఏర్పాటు చేసుకునే జిల్లాలు ఆ ప్రాంతంలో నివసించే ప్రజలందరికీ సమాన దూరంలో ఉంటే వారికి సౌలభ్యంగా ఉంటుంది. జిల్లాలో కొన్ని మండలాల వారికి పది కిలోమీటర్లు, మరికొన్ని మండలాల వారికి 80 కిలోమీటర్ల దూరంలో జిల్లా కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. దీని వల్ల పెద్దగా ప్రయోజనం ఒనకూడదు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలతో ఆ జిల్లా ప్రజలకు పనులు ఉంటూనే ఉంటాయి. అందరికీ సమానదూరం ఉండే విధంగా చర్యలు తీసుకుంటే సమ న్యాయం జరుగుతుంది.
ప్రతి జిల్లాలో ఇదే సమస్య
అటు ప్రకాశం జిల్లాలో ఒంగోలు కేంద్రంగా ఇప్పటికే జిల్లా ఉంది. బాపట్ల జిల్లా ఏర్పాటు చేస్తే కొన్ని నియోజకవర్గాలు అందులో కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే త్రిపురాంతకం మండల ప్రజలకు ఒంగోలు రావాలంటే 90 కిలోమీటర్లు ప్రయాణించాలి. కొత్త జిల్లా ఏర్పాటు చేసినా వారికి కలిగే ప్రయోజనం శూన్యం. అలాగే కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం. ఈ విషయం జనం ఎప్పుడో మరచిపోయారు. కార్యాలయాలు అన్నీ దాదాపుగా విజయవాడలోనే ఉంటాయి. కలెక్టర్ కూడా చుట్టం చూపుగా అప్పుడప్పుడు మచిలీపట్నం వెళ్లి చూసుకుని వస్తుంటారు.
తాజాగా విజయవాడ కేంద్రంగా మరో జిల్లా రానుంది. దీని వల్ల కృష్ణా జిల్లా తిరువూరు, జగ్గయ్యపేట,నూజివీడు ప్రాంత ప్రజలకు ఒరిగింది లేదు. విజయవాడ జిల్లా కేంద్రం ఏర్పాటును ఎవరూ వ్యతిరేకించరు కానీ, జిల్లాలోని రెండు జిల్లా కేంద్రాలు తూర్పుప్రాంత ప్రజలకు దగ్గరగా ఉంటాయి. మరో నాలుగు నియోజకవర్గ ప్రజలకు మాత్రం ఎప్పటి మాదిరే. వారికి ఒకగూరే ప్రయోజనం సున్నా.
AlsoRead ;- ఏపీలో 26వ జిల్లా ఏమిటో తెలుసా?











