కథలేక సినిమా కదల్లేకపోతోందనే మాటను తరచూ వింటున్నాం. కొత్త కథల కోసం ఎంత కసరత్తులు చేసినా దొరకనప్పుడు హిట్ ఫార్ములా వైపే సినీ జనుల చూపు ఉంటుంది. హిట్ ఫార్ములా అంటే మరేదో కాదు ఏ సినిమా హిట్ అయితే అలాంటి కథనే ఎంచుకోవడం అన్నమాట. ఒకే సమయంలో ఒకే తరహా కథలను జనం కూడా బాగానే ఆదరిస్తున్నారు. సినిమా హిట్ అవ్వాలంటే హీరోలో సరుకుండాలి… కానీ సరుకు లేకపోతే కూడా హిట్ అవుతున్న సినిమాలు ఇప్పుడొస్తున్నాయి. సరుకంటే ఏంటో కాదు మగతనం అన్నమాట.
‘ఉప్పెన’ సినిమాలో అదే కొత్త పాయింట్. మెగా ఇమేజ్ ను పక్కన పెట్టి వైష్ణవ్ తేజ్ ఈ సినిమా చేయడం విశేషమే. సాధారణంగా తొలి సినిమాకి ఇలాంటి కథా వస్తువును ఎంచుకోడానికి ఎవరూ సాహసం చేయరు. హీరో మగతనం కోల్పోతే హీరోయిన్ రియాక్షన్ ఎలా ఉంటుంది? అసలు ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తారా? లాంటి ప్రశ్నలు ఎన్నో ఉత్పన్నమైనా ప్రేక్షకులు మాత్రం ‘ఉప్పెన’కు పట్టం కట్టారు. ఉప్పెన బాటలోనే మరో సినిమా రాబోతోంది. ఆ సినిమా పేరే ‘ఏక్ మినీ కథ’. మైత్రీ మూవీస్ ‘ఉప్పెన’ నిర్మిస్తే ‘ఏక్ మినీ కథ’ను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.
‘మిర్చి’ నుంచి ‘రాధేశ్యామ్’ వరకూ భారీ ప్రాజెక్టులు చేస్తున్న యూవీ క్రియేషన్స్ కు ఇలాంటి చిన్న సినిమా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. తమ బ్యానర్ కు అనుబంధంగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ ను స్థాపించి మరో నిర్మాణ సంస్థ మ్యాంగో మాస్ మీడియాతో కలిసి ‘ఏక్ మినీ కథ’ తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ చిత్రం ‘జురాసిక్ పార్క్’కు సైజ్ డజ్ నాట్ మేటర్ అనే ట్యాగ్ లైన్ ఉంటుంది. ఈ ఏక్ మినీ కథకు ‘డజ్ సైజ్ మేటార్’ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు. మేటర్ అంటే ఇందులో ఏముంటుందో మనం అర్థం చేసుకోవాలి. ‘ఏక్ మినీ కథ’ చిత్రం ద్వారా కార్తీక్ రాపోలు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఈ సినిమా హీరో మరెవరో కాదు దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్. ఇంతకుముందు ‘పేపర్ బోయ్’ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమా ట్రైలర్ కూడా ఇటీవల విడుదలైంది. ‘అది చిన్నదైతే మాత్రం ప్రాబ్లమ్ పెద్దదే బ్రో’ అనే డైలాగ్ ఇందులో ఉంది. సినిమాపై ఆసక్తిని పెంచేలా ఈ డైలాగ్ ఇచ్చారు. ఉప్పెనలో హీరో మగతనం కోల్పోవడం ప్రధానాంశమైతే, ఇందులో హీరో మగతనం సైజు చిన్నగా ఉండటం ప్రధానాంశమట. చిన్నగా ఉండటం వల్ల హీరో ఎలాంటి సమస్యను ఎదుర్కొన్నాడో ఇందులో చూపించబోతున్నారన్నది మనకు అర్థమవుతోంది.
Must Read ;- ‘ఉప్పెన’ దర్శకుడికి కాస్ట్లీ కార్ గిఫ్టిచ్చిన నిర్మాతలు