ఏపీ రాజకీయ వర్గాల్లో నామినేటెడ్ పదవుల విషయంపై మరోసారి చర్చ మొదలైంది. టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం కేంద్రంగా ఈ చర్చ నడుస్తోంది. జూన్ 21న టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగిసింది. వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం పొడిగిస్తారని, పాలక మండలి సభ్యుల్లో కొంతమందిని మార్చుతారనే చర్చ నడిచినా టీటీడీ పాలకమండలి స్థానంలో స్పెసిఫైడ్ అథారిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం పొడగింపు లేదని తేలిపోయింది. దీంతో సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కుటుంబీకుడైన వైవీ సుబ్బారెడ్డికి ఏ పదవి ఇస్తారనే చర్చ మొదలైంది. వైవీ సుబ్బారెడ్డి తన పదవీ కాలం పొడగించుకోవాలనే ఉద్దేశంలో లేరని, ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉండాలని భావిస్తున్నారని వైసీపీ నాయకులు చెబుతున్నారు.
ప్రకాశం జిల్లాలో వైసీపీ నాయకుల ఆధిపత్య పోరు
ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో వైసీపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. మాగుంట, బాలినేని మధ్య ఆధిపత్య పోరు పార్టీకి తలనొప్పిగా మారిందని చెబుతున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి 2019 ఎన్నికల్లో ఆ సీటును వదులుకుని మాగుంట శ్రీనివాసులు రెడ్డికి అవకాశం ఇచ్చారు. అదే జిల్లాలో కీలకంగా ఉన్న ఏపీ సీఎం వైఎస్‌కి సమీప బంధువైన బాలినేనికి కూడా అప్పట్లో మాగంటతో మంచి సంబంధాలే ఉండేవి. అనంతర కాలంలో రిమ్స్ విషయంలో చోటుచేసుకున్న పరిణామాలతో పాటు టీడీపీ నుంచి కొందరు నాయకుల చేరిక, ఎమ్మెల్సీ ఎన్నికలు తదితర అంశాల్లో విభేదాలు తలెత్తాయి. చివరికి ఆనందయ్య మందు విషయంలోనూ ఆ ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పలుమార్లు పార్టీ ముఖ్యనాయకులు సర్దుబాట్లు చేశారు. కొన్నాళ్ల పాటు సైలెంట్‌గా ఉన్నా మళ్లీ ఆధిపత్య పోరు తెరపైకి వస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే ఆ ఆధిపత్య పోరుకి చెక్ పెట్టవచ్చని భావిస్తున్నట్లు సమాచారం.
Must Read ;- అడుసు తొక్కనేల, కాళ్లు కడగనేల.. క్షత్రియులను శాంతింప చేయడానికి టీటీడీ ఛైర్మన్ పదవి?
ధిల్లీలో లాభీయింగ్ ప్రభావం తగ్గిందా..
అదే సమయంలో గతంలో ధిల్లీ స్థాయిలో లాబీయింగ్ వ్యవస్థ బలంగా ఉండేది. అపాయింట్‌మెంట్‌లు, రాజకీయ సర్దుబాట్లు తదితర అంశాల్లో సానుకూల ఫలితాలే ఎక్కువగా వచ్చేవి. కొన్నాళ్లుగా ధిల్లీలో లాభీయింగ్ ప్రభావం తగ్గిందని, ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. వైఎస్ కుటుంబానికి దగ్గరి బంధువు కావడంతో పాటు విధేయత చూపించే వ్యక్తిగా ఉన్న వైవీ సుబ్బారెడ్డికి ఏపీ ప్రత్యేక ప్రతినిధి హోదాలో ధిల్లీ బాధ్యతలు అప్పజెప్పే యోచనలో ఉన్నట్లు చర్చ నడుస్తోంది. కచ్చితమైన సమాచారం ఇవ్వడంతో పాటు ధిల్లీలో రాజకీయ కార్యక్రమాలను, పార్టీ వ్యూహాలను విజయవంతంగా అమలు చేసే నమ్మకమైన మరో వ్యక్తి అవసరమని పార్టీ భావిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం లోక్‌సభ ఎంపీలతో పాటు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ధిల్లీ స్థాయిలో పార్టీ పరంగా వ్యవహారాలను నడిపిస్తున్నారు. అయితే విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలూ అప్పగించడంతో పూర్తిస్థాయిలో సమయం కేటాయించడం కుదరడం లేదనే అభిప్రాయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ పార్టీపరంగా పాజిటీవ్ కోణంలో చెప్పేవారి అభిప్రాయాలే. ఇక ఇతర పక్షాల వైపు నుంచి చూస్తే రాజకీయపరంగా పలు అంశాలు తెరపైకి వస్తున్నాయి. బెయిల్ రద్దు పిటిషన్, బీజేపీ వ్యూహాలు, వేరు కుంపట్లు లాంటి అంశాల ప్రాతిపాదికగా కూడా ఈ చర్చలు నడుస్తున్నాయి. ఏ కోణంలో చూసినా వైవీ సుబ్బారెడ్డికి పార్టీ పరంగా బాధ్యతలు అప్పగిస్తే సమస్యలు ఉండవనే అభిప్రాయం వైసీపీ ముఖ్య నాయకుల్లో ఉందని చెబుతున్నారు.
రఘురామ వ్యవహారం నుంచి బయట పడేందుకు..
మరోవైపు నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కొన్నాళ్లుగా వైవీ సుబ్బారెడ్డిని టార్గెట్ చేశారు. ఎన్నికల సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో కీలకంగా వ్యవహరించిన వైవీ సుబ్బారెడ్డిని టార్గెట్ చేసి పలు విమర్శలు చేస్తున్నారు. రఘురామకృష్ణరాజు అరెస్టు సమయంలో ఆయనపై దాడి ఆరోపణలు, బెయిల్ అంశంలో చోటుచేసుకున్న పరిణామాలు, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చాయి. ఈ ఎపిసోడ్‌లో రఘురామకృష్ణరాజు సామాజిక వర్గం కూడా వైసీపీకి దూరమైందనే అభిప్రాయం కూడా నెలకొంది. వీటి నుంచి బయటపడేందుకు రఘురామకృష్ణరాజు సామాజిక వర్గానికి చెందిన వారికి టీటీడీ బాధ్యతలు అప్పగించి మళ్లీ ఆ వర్గాన్ని దగ్గర చేసుకోవచ్చే వ్యూహం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపించి ఢిల్లీలో లాబీయింగ్ బాధ్యతలు, ప్రకాశం జిల్లాలో సర్దుబాట్లు చేసే బాధ్యత అప్పగించవచ్చనే ప్రచారం జరుగుతోంది. వైవీ సుబ్బారెడ్డి విషయంలో ఎలాంటి వ్యూహం లేకుండా వైఎస్ జగన్ నిర్ణయం తీసుకోరని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ధిల్లీ బాధ్యతలు, రఘురామకృష్ణరాజుకి చెక్ పెట్టడం, ప్రకాశం జిల్లాలో పార్టీని ఏకతాటిపైకి తీసుకురావడం లాంటి అంశాల్లో వైవీ సుబ్బారెడ్డి సేవలు వినియోగించుకుంటారని చెబుతున్నారు.
Must Read ;- చిక్కుల్లో జగన్.. వైసీపీ వర్గాల్లో టెన్షన్!











