Prasant Kishore In Talks With Jagan To Tie With Congress :
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు నిజంగానే ముందు నుయ్యి, వెనుక గొయ్యి చందంగా మారిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తనపై నమోదైన అక్రమాస్తుల కేసులో జగన్ ఇప్పటికే బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఆ బెయిల్ ను రద్దు చేయాలంటూ జగన్ పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు నేరుగా సీబీఐ కోర్టులోనే పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే విచారణ పూర్తి కాగా.. వచ్చే నెల 25న తన తుది నిర్ణయాన్ని వెలువరిస్తానని సీబీఐ కోర్టు న్యాయమూర్తి ప్రకటించారు. ఆ తీర్పులో తన బెయిల్ ఎక్కడ రద్దు అవుతుందోనన్న బెంగ జగన్ ను, ఆయన అభిమాన గణాన్ని పట్టి పీడిస్తోందనే చెప్పాలి. ఇలాంటి తరుణంలో జాతీయ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలు జగన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. మోదీకి వ్యతిరేకంగా అన్ని విపక్షాలను ఏకం చేసే పనిని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన భుజాన వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన జగన్ పార్టీతోనూ మంతనాలు సాగించారట. తనను జైలుకు పంపిన కాంగ్రెస్ తో తానెలా జతకడతానని జగన్ అంటే.. మున్ముందు సేఫ్ గా ఉండాలంటే కాంగ్రెస్ తో జట్టు కట్టక తప్పదన్న రీతిలో జగన్ కు పీకే స్ట్రాంగ్ వార్నింగ్ లాంటి సలహా ఇచ్చారట. ఈ మాట విన్నప్పటి నుంచి జగన్ కు కంటి మీద కునుకు లేకుండా పోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ కు దూరంగా ఉంటే..
జగన్ భావిస్తున్నట్లుగానే తనపై అక్రమాస్తుల కేసు పెట్టడంతో పాటుగా తనను జైలుకు వెళ్లేలా చేసింది నాటి యూపీఏ ప్రభుత్వమే. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాటి ఎమ్మెల్యే శంకర్ రావు లేఖ రాస్తే.. దానిని హైకోర్టు విచారణకు స్వీకరించి సీబీఐ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేయడం, సీబీఐ జగన్ ను అరెస్ట్ చేయడం, జగన్ ఏకంగా 16 నెలల పాటు జైల్లో ఉండటం.. చివరకు ఎలాగోలా బెయిల్ తెచ్చుకుని బయటకు రావడం, ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఓటమి, 2019లో విజయం.. ఇలా జగన్ పయనం సాగింది. తనను ఇబ్బందులకు గురి చేసిన కాంగ్రెస్ పార్టీపై ఆయనకు పీకల దాకా కోపం ఉన్న మాట వాస్తవమే. అయితే ఇప్పుడు ప్రజాకంటక పాలన సాగిస్తున్నారన్న ఆరోపణలతో దేశంలోని ప్రధాన పార్టీలన్నీ మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా ఏకం అవుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో జరుగుతున్న ఈ ఏకీకరణ.. వచ్చే ఎన్నికల్లో మోదీని గద్దె దింపినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అందులోనూ ఈ కూటమికి ప్రశాంత్ కిశోర్ అన్నీ తానే ముందుకు నడిపిస్తున్నారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే.. 2024లో విపక్షాల కూటమి అధికారంలోకి వస్తే.. మళ్లీ జగన్ కు ఇబ్బందులు తప్పవు. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయిరెడ్డిని కలిసిని ప్రశాంత్ కిశోర్ చెప్పారట. మున్ముందు కష్టాలు కొని తెచ్చుకోకూడదంటే.. అవమానించిన కాంగ్రెస్ తో కలిసి నడవాల్సిందేనని పీకే చెప్పేశారట.
బీజేపీకి దూరం జరిగితే..
పీకే చెప్పిన మాట కరెక్టేనని నమ్మి.. కాంగ్రెస్ గూటికి జగన్ చేరితే. ఇప్పటికిప్పుడే జగన్ బెయిల్ రద్దైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే.. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ స్వయంగా ఆయన పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ త్వరగా తెమలకుండా ఉండేలా జగన్ తనదైన శైలి యత్నాలు చేసినట్టుగా వార్తలు వినిపించాయి. బీజేపీ అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకున్న జగన్.. సీబీఐ చేత కౌంటర్ దాఖలు కాకుండా చూసుకున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. రఘురామ వేసిన పిటిషన్ ప్రకారం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ ఒక్క మాట చెబితే. మరుక్షణమే జగన్ బెయిల్ రద్దు ఖాయమే. అయితే ఏ ఒత్తిడి పనిచేస్తుందో తెలియదు గానీ.. సీబీఐ జగన్ బెయిల్ ను రద్దు చేయాలని చెప్పడం లేదు. తన కౌంటర్ దాఖలు కోసం నాలుగైదు సార్లు విచారణ వాయిదా పడేలా చేసిన సీబీఐ శుక్రవారం నాటి విచారణ సందర్భంగా అసలు తాను కౌంటర్ దాఖలు చేయబోనని, కోర్టు తన ఇష్టానుసారం ఈ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చని, ఆ నిర్ణయంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పేసింది. అంటే.. కోర్టు విచక్షణకు వదిలేసినట్టన్నమాట. ఇలాంటి కీలక సమయంలో జగన్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే.. బీజేపీ సర్కారు అలా చిటికేసి సీబీఐ చేత కౌంటర్ దాఖలు చేయించి జగన్ బెయిల్ ను రద్దు చేయిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ముందుకెళితే నుయ్యి.. వెనక్కెళితే గొయ్యి అన్న చందంగా జగన్ పరిస్థితి మారిందన్న వైనంపై ఆసక్తికర విశ్లేషణలు కొనసాగుతున్నాయి.











