(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
భారతదేశంలో ఏకైక, అత్యంత పురాతన, ప్రతిష్టాత్మకమైన శ్రీకాకుళం అరసవెల్లి శ్రీ సూర్య నారాయణ స్వామికి కరోనా ఎఫెక్ట్ తప్పలేదు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిర్వహించే కళ్యాణోత్సవానికి భక్తులను అనుమతించకపోవడంతో ఆలయం బోసిపోయింది.
సంప్రదాయబద్ధంగా ఆదిత్యుని కళ్యాణం
ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా బుధవారం అత్యంత వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ప్రతి ఏడాది మాదిరిగానే స్వామి వారికి వేద మంత్రోచ్ఛరణ, మంగళ వాయిద్యాల మధ్య సంప్రదాయబద్ధంగా కళ్యాణం నిర్వహించారు.
భక్తుల నిరాశ
ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిర్వహించే స్వామి వారి కళ్యాణానికి ఆంధ్రా, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుండి వేలాదిమంది భక్తులు హాజరయ్యేవారు. స్వామి వారిని దర్శించి, మొక్కులు చెల్లించుకునేవారు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో స్వామి వారి కళ్యాణం తిలకించేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో భక్తులు నిరాశకు గురయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వి. హరి సూర్య ప్రకాష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కళ్యాణ సేవకు భక్తులను ఎవరినీ అనుమతించలేదని తెలిపారు.
Must Read ;- పైడితల్లి అమ్మవారికీ తప్పని కరోనా కష్టాలు











