క్రిస్టియన్ అయిన ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి… క్రైస్తవులంతా వేడుకగా జరుపుకునే క్రిస్మస్ పర్వదినాన… సరికొత్త జీవోను విడుదల చేశారు. సంక్షేమ రాజ్యం అని చెప్పుకుంటున్న జగన్… సరిగ్గా క్రిస్మస్ నాడు రాష్ట్రంలోని పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థుల విద్యాభ్యాసం ప్రశ్నార్థకం కానుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా..
ఏపీలోనే కాకుండా యావత్తు దేశవ్యాప్తంగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు కేజీ నుంచి పీజీ దాకా, అంతకంటే ఉన్నత విద్యకు కూడా ప్రభుత్వాలే ఫీజులను చెల్లిస్తున్నాయి. ఏపీలో కూడా ఆ పద్ధతి అనాది కాలం నుంచే అమలువుతూ ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాత బడుగు, బలహీన వర్గాలతో పాటు ఇతర అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్లను వర్తింప జేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆ తర్వాత అధికారం చేపట్టిన వారు కూడా అమలు చేస్తూ వస్తున్నారు. ఇతరుల మాట ఎలా ఉన్నా… వైఎస్ కుమారుడిగా, ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాత్రం తన తండ్రి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి తొలి పోటు పొడిచారు. రాష్ట్రంలోని పీజీ విద్యార్థులకు అందజేస్తున్న పీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే రద్దు చేస్తున్నట్లుగా జగన్ సర్కారు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. అది కూడా జగన్ ఇష్టదైవం జీసస్ క్రైస్ట్ పుట్టిన రోజైన క్రిస్మస్ నాడే జగన్ సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం మరింత ఆశ్చర్యకరం.
నాడు వైఎస్ఆర్ శ్రీకారం చుడితే..
పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి కూడా విద్యకు దూరం కాకూడదన్న ఒకే ఒక లక్ష్యంతో నాడు వైఎస్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు శ్రీకారం చుడితే… ఇప్పుడు ఆయన కుమారుడే దీనికి కత్తెర వేస్తూ తొలి అడుగు వేయడం గమనార్హం. జగన్ అధికారంలోకి వచ్చాక… గత పాలకుల ముద్రలన్నీ చెరిపేసేలా వ్యవహిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో అప్పటి దాకా అమలు అయిన పథకాల పేర్లను మార్చేస్తున్నారు. అందులో భాగంగానే… ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి కూడా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అంటూ కొత్త పేర్లు పెట్టేశారు. ఇక అమ్మ ఒడి పేరిట మరో పథకాన్ని ప్రవేశపెట్టిన జగన్… దానిని ఒకటి నుంచి ఇంటర్ వరకు అమలు చేస్తున్నారు. ఆపై చదువులకు మాత్రం జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెనలను అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద ఇంటర్ ఆపై స్థాయి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటుగా ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న స్కాలర్ షిప్‌లను ఈ రెండు పథకాల పేరిట పేర్లు మార్చి ఇస్తున్నారు.
విద్యార్థుల నమ్మకం వమ్ము..
ఇక్కడి దాకా బాగానే ఉన్నా… వైఎస్ తనయుడిగా వైఎస్ జగన్ ఈ సంక్షేమ పథకాలను మరింత మెరుగ్గా అమలు చేస్తారని చాలా మంది భావించారు. ప్రత్యేకించి విద్యార్థులు జగన్ చెప్పిన మాటలను బాగానే నమ్మారు. అయితే వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ జగన్ సర్కారు సరిగ్గా క్రిస్మస్ నాడు పీజీ విద్యార్థులకు అమలు చేస్తున్న జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను రద్దు చేస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఈ జీవోలో మరింత కఠిన నిర్ణయాలను కూడా జగన్ సర్కారు వెల్లడించింది.
సాధారణంగా ఆయా యూనివర్సిటీల్లో రెగ్యులర్ కోర్సులను చదివే విద్యార్థులకు ఏనాడూ ఫీజుల పరంగా ఇబ్బంది కలిగిన సందర్భం లేదనే చెప్పాలి. ఆయా వర్సిటీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ కోర్సులకు మాత్రమే విద్యార్థులు ఫీజులను సొంతంగా భరించేవారు. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావించిన జగన్ సర్కారు.. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులతో పాటుగా రెగ్యులర్ కోర్సులను చదివే పీజీ విద్యార్థులకు పై రెండు పథకాలు వర్తించవని ప్రకటించేసింది. మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అక్కర్లేదు గానీ… పేద విద్యార్థులంతా సీట్లు సంపాదించే కన్వీనర్ కోటా సీట్లకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదంటే… ఇక రాష్ట్రంలో పేద విద్యార్థుల ఉన్నత చదువులు అటకెక్కినట్టేనని చెప్పక తప్పదు.