కష్టమొస్తే రక్షించాలని దేవుడ్ని వేడుకుంటాం. మరి అందరినీ రక్షించే ఆ దేవుడికే కష్టమొస్తే..! ఎవరికి చెప్పుకుంటాడు? ఏమని మొర పెట్టుకుంటాడు? అదేంటి? దేవుడికి ఎందుకు కష్టమొస్తుంది? అనుకుంటున్నారా! ఇప్పుడు ఏపీలో నిజంగా దేవుడికే కష్టమొచ్చింది. ఎక్కడ ఏ చిన్న రాయి కనిపించినా.. దానికి నాలుగు బొట్లు పెట్టేసి.. అందులో దేవుడ్ని చూసుకుంటూ పూజలు చేసి గుళ్లు కట్టేసే ఏపీలో.. నేడు గుడుల్లోకి దొంగలు చొరబడుతున్నారు. వీరు హుండీలు ఎత్తుకెళ్లరు. దొరికిన విగ్రహాన్ని దొరికినట్టు ధ్వంసం చేస్తారు. ఎప్పుడో మొఘలుల కాలంలో గుడులపై దాడులు జరిగాయని విన్నాం. మళ్లీ ఇన్నేళ్లకు జగన్ పాలనలో ఆ దాడులను ప్రత్యక్ష్యంగా చూస్తున్నాం.
వరుస విద్వేష దాడులు
మొదటగా గత సంవత్సరం జనవరిలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఓ ఆలయంపై దాడి చేసిన దుండగులు.. అక్కడున్న దేవుళ్లు దేవతల విగ్రహాలను ధ్వంసం చేశారు. ఇక్కడ మొదలైన ఈ విధ్వంసకాండ ఈ జనవరి ఒకటిన సుబ్రమణ్య స్వామి విగ్రహం ధ్వంసం చేసేవరకు కొనసాగుతూనే ఉంది. తాజాగా కర్నూలు, విజయవాడల్లో కూడా విగ్రహాల ధ్వంసం స్థానికంగా కలవరాన్ని రేపింది. ఇలా.. ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక విగ్రహాన్ని ధ్వంసం చేస్తూనే ఉన్నారు. అడ్డకట్ట వేయాల్సిన ప్రభుత్వం.. వినోదం చూస్తోంది. విగ్రహాలను పెకలించడం లాంటి ఘటనలు గతంలోనూ జరిగాయిగానీ.. అది గుప్త నిధుల కోసం మాత్రమే. వాటి వెనుక ఎలాంటి కుట్రా లేదు. నిన్నమొన్నటి రామతీర్థం దాడిలో.. శ్రీరాముడి విగ్రహం తలను ధ్వంసం చేసిన దుండగులు.. ఆ విగ్రహంపైన ఉన్న వెండి ఆభరణాలను మాత్రం తాకలేదు. ఇదే పలు అనుమానాలకు తావిస్తోంది. దుండగుల వెనుక ఎవరో ఉన్నారని, వారికి ఆర్థిక ప్రయోజనాల కన్నా.. ఇంకేవో ప్రయోజనాలు ముఖ్యమని స్పష్టంగా అర్థమవుతోంది.
రాజకీయ కుట్రపై అనుమానాలు?
హిందూ ఆలయాలపై ఇంతగా దాడులు జరుగుతున్నా.. ప్రభుత్వం మాత్రం నిమ్మకునీరెత్తినట్లు ఉంటోంది. చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడంలేదు. సీఎం.. దేవుడి జోలికి వెళ్లిన వారిని దేవుడే శిక్షిస్తాడు అంటూ అధ్యాత్మిక ధోరణిలో వ్యాఖ్యలు చేయడం శోచనీయం. దీంతో.. ఈ విధ్వంసాల వెనుక రాజకీయ కుట్రలున్నాయని కొందరు అనుమానిస్తున్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ కొన్నేళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో చాలా వరకు విజయవంతమైంది. దీంతో.. ఇక ఏపీపై తీవ్రంగా దృష్టి సారిస్తోంది. కానీ, ఇక్కడ తెలంగాణలో లాంటి పరిస్థితులు లేవు. మతపరమైన భావోద్వేగాలకు అస్సలు చోటు లేదు. ఇక్కడ హిందువులు, ముస్లింలు కలిసిమెలసి జీవిస్తుంటారు. ఈ నేపథ్యంలో.. ఇక్కడ బీజేపీ ఎదిగేందుకు అవకాశం లేదు. పైగా ఏపీకి ఆ పార్టీ చేసిన ద్రోహాన్ని జనం ఇంకా మరచిపోలేదు. దేశంలోని మిగిలిన రాష్ట్రల్లో అమలు చేస్తున్నట్లు.. మజ్లిస్ పార్టీతో పోటీచేయించాలన్నా.. ఆ పార్టీకీ ఇక్కడ చోటులేదు. అంటే.. ఇక్కడ బీజేపీ బలపడాలంటే.. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టాలి. కలిసిమెలసి జీవిస్తున్న రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టాలి.
అందుకేనా ఈ దాడులు?
ఈ రాజకీయ వ్యూహం ఫలించాలంటే.. కచ్చితంగా అధికార పార్టీ సహకారం అవసరం. ఎందుకంటే.. ప్రభుత్వం కఠినంగా స్పందించిందంటే.. ఈ వ్యూహం బెడిసి కొడుతుంది. అందుకే.. పీకల్లోతు కేసుల్లో మునిగి ఉన్న జగన్ సహకారాన్ని కేంద్రం కోరిందని, దానికి ఆయన ఒప్పుకోవాల్సి వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికార పక్షం దాడులు చేయిస్తుంటే.. ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్లు నటిస్తున్న బీజేపీ.. ఆందోళనలకు దిగుతోందని వారు అంటున్నారు. ఇలా.. హిందువుల మనోభావాల మీద దెబ్బకొట్టి.. ప్రశాంతంగా జీవిస్తున్న ఇరు వర్గాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తోందని విశ్లేషిస్తున్నారు. ఆ చిచ్చు లోంచి రేగిన మత విద్వేషాలను మెట్లుగా చేసుకుని రాష్ట్రంలో ఎదగాలని బీజేపీ యోచిస్తోందని చెబుతున్నారు.
వైసీపీ ఆశిస్తున్నది ఇదేనా?
చంద్రబాబును, టీడీపీని రాష్ట్రంలో భూస్థాపితం చేయడమే జగన్ లక్ష్యం. రాష్ట్రంలో బీజేపీ బలపడితే.. అది టీడీపీకి నష్టమని, అందుకే.. బీజేపీకి చేయిచ్చి.. బలపడేలా చేస్తే.. ఆటోమేటిక్ గా టీడీపీ మూడో స్థానానికి పడిపోతుందనేది జగన్ లెక్కగా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కానీ, రాష్ట్రంలో ఎన్ని విగ్రహాలు ధ్వంసం అవుతున్నా.. ఎన్ని గుడులపై దాడులు జరుగుతున్నా.. విజ్ఞులైన జనం మాత్రం సంయమనంతో వ్యవహరిస్తున్నారు. త్వరలో తిరుపతి పార్లమెంటు స్థానానికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ దాడులు మరింతగా పెరగవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అక్కడ పోటీ చేసేందుకు సిద్ధపడుతున్న బీజేపీ.. గెలవలేకున్నా.. కనీసం రెండో స్థానం దక్కించుకోవాలని చూస్తోందని వ్యాఖ్యనిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ కూడా బీజేపీకి సహకరిస్తున్నారని, రెండో స్థానం బీజేపీదేనంటూ పదే పదే అంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. మరి చూడాలి.. ఏ పుట్టలో ఏ పాముందో! ఏపీ చుట్టూ బిగుస్తున్న రాజకీయ ఉచ్చులోంచి జనం బయటపడతారో.. లేదో కాలమే నిర్ణయించాలి.
Also Read: ఎవరికివారే : తిరుపతి ఉపఎన్నికల్లో జనసేన, బీజేపీ పోటీ