(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం సాయంత్రం మయూరి జంక్షన్ వద్ద రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఘటనలో 28 మంది టీడీపీ నాయకులపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. మంత్రి వెల్లంపల్లి దిష్టిబొమ్మను దగ్ధం చేసినప్పుడు అడ్డుకున్న తనను గాయపర్చి విధులకు ఆటంకం కలిగించారంటూ వన్‌టౌన్ ఎస్‌ఐ కిరణ్‌కుమార్ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. వారిలో ఎ1గా అదితి గజపతి, ఎ2గా ఐవిపి రాజు, ఎ3గా కర్రోతు వెంకట నరశింగరావు, ఎ4గా బొద్దల నరశింగరావుతో పాటు మరో 24 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దీంతో అన్యాయంగా టీడీపీ నాయకులపై కేసులు పెట్టారని, వెంటనే ఆ కేసును ఉపసంహరించుకోవాలని కోరుతూ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ కనకల మురళీమోహన్, అడ్వకేట్ హరి నారాయణతో కలిసి జిల్లా ఎస్‌పి రాజకుమారికి సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి మాట్లాడుతూ అశోక్ గజపతిరాజుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యలు అశోక్ అభిమానులను తీవ్రంగా బాధించాయని తెలిపారు. అశోక్ గజపతిరాజుకు మద్దతుగా టీడీపీ నాయకులు శాంతియుతంగా నిరసన ర్యాలీ నిర్వహించగా అన్యాయంగా కేసులు పెట్టడం సరికాదని తెలిపారు. ప్రభుత్వం టీడీపీ నాయకుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇవ్వాలని, లేనిపక్షంలో కోర్టుల ద్వారా న్యాయ పోరాటం చేస్తామని అన్నారు.
Also Read: టీమ్ జగన్ 2.0: లోనికి ఎవరు? బయటికి ఎవరు?











