(ఒంగోలు నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
ఏపీలో 2021 మార్చి 31 నాటికి ఎంపీ స్థానాల ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటు ఖాయమైంది. ప్రభుత్వం ఈ విధానాన్ని అవలంబిస్తే.., ప్రస్తుత ప్రకాశం జిల్లా ఒంగోలు, బాపట్ల జిల్లాలుగా విడిపోతుంది. ఇదే ఇప్పుడు ప్రకాశం జిల్లా ప్రజల్లో అసంతృప్తిని రేకెత్తిస్తోంది.
దశాబ్దాలుగా అన్ని రాజకీయ పార్టీలు ప్రకాశం జిల్లాను నిర్లక్ష్యం చేశాయి. రాష్ట్ర విభజన తర్వాత అన్నా.. అభివృద్ధి చెందుతుంది అనుకుంటే.., టీడీపీ హయాంలో శిలా ఫలాకాలు పడ్డాయే గానీ, భారీ స్థాయిలో ఉద్యోగాలను కల్పించే పరిశ్రమ ఒక్కటి ఏర్పడలేదు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక జిల్లా అభివృద్ధి చెందుతుందని అన్ని వర్గాల ప్రజలు బలంగా విశ్వసించారు. 2014లో వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే…, ప్రకాశం జిల్లాలోని దొనకొండ కేంద్రంగా ఏపీ రాజధాని ఏర్పడేదని జిల్లా వాసులు బలంగా నమ్మారు.
కానీ, టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ ఆశలు గల్లంతయ్యాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ స్థానాల ప్రాతిపదికన ఒంగోలు, బాపట్ల జిల్లాలు ఏర్పడతాయని.., ఎలాంటి మార్పులు ఉండవని సీఎం జగన్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంతో అసలు జిల్లా అభివృద్ధి చెందడం సంగతి పక్కన పెట్టి.., మరింత వెనకబడిపోతామా అనే భయాలు తలెత్తుతున్నాయి.
ఒంగోలు జిల్లాతో నష్టం ఏంటి…?
అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో వైసీపీ ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఒంగోలు జిల్లాగా ఏర్పడితే ఆదాయం లేని జిల్లాగా నంబర్ 1 స్థానంలో నిలిచే అవకాశం ఉంది. రాష్ట్రానికి, ప్రకాశం జిల్లాలోని స్థానిక సంస్థలకు కల్పతరువుగా ఉన్న గ్రానైట్ పరిశ్రమ చీమకుర్తి, బల్లికురవ మండలాల్లో అధికంగా విస్తరించి ఉంది. ఈ రెండు మండలాలు భోగోళికంగా ఒంగోలు జిల్లా కేంద్రానికి కేవలం 20 కి.మీ ఉంటే.., బాపట్ల కేంద్రానికి 80-90 కి.మీ దూరంలో ఉన్నాయి..కానీ, ఇవి ఉన్న సంతనూతలపాడు, అద్దంకి నియోజకవర్గాలు బాపట్ల ఎంపీ స్థానం పరిధిలో ఉండటంతో.., గ్రానైట్ పరిశ్రమపూర్తిగా ఏర్పడబోయే బాపట్ల జిల్లాకు వెళ్లిపోతుంది.
చీరాలలోని జీడిపప్పు, ఆక్వా పరిశ్రమలు, సింగరాయకొండ వంటి పుణ్యక్షేత్రాలు, గుండ్లకమ్మ, రామతీర్థం వంటి జల ప్రాజెక్టులు అన్నీ జిల్లాకు దూరమవుతాయి. మరీ ముఖ్యంగా ఏపీ విభజన చట్టంలో ప్రకాశం జిల్లాకు పోర్టును కేటాయించారు. గత టీడీపీ హయాంలోనే రామాయపట్నంలో పోర్టు ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. కానీ, పోర్టు నిర్మించబోయే రామాయపట్నం కందుకూరు నియోజకవర్గంలో ఉంది. ఇప్పుడు జిల్లాల విభజనతో కందుకూరు కొత్తగా ఏర్పడబోయే నెల్లూరు జిల్లాలో కలసిపోతోంది. అన్ని పరిశ్రమలు, ఉపాధి కల్పించే కీలకమైన వ్యవసాయ రంగాలు దూరమై…, ఆదాయం, ఉపాధి కల్పన, వ్యవసాయానికి నీళ్లు లేని జిల్లాగా ఒంగోలు మిగులుతుంది అని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఒంగోలు ఎంపీ స్థానం వాస్తవ పరిస్థితి ఏమిటి…!
ఒంగోలు ఎంపీ స్థానం పరిధిలో ఒంగోలు, సంతనూతలపాడు, కొండెపి, దర్శి, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాలు ఉన్నాయి. ఎంపీ స్థానాల ప్రాతిపదికన విభజన జరిగితే సంతనూతలపాడు కొత్తగా ఏర్పడబోయే బాపట్ల జిల్లాలో కలుస్తోంది. ఇక మిగిలిన 6 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో పరిశ్రమలు లేవు. వెలిగొండ ప్రాజెక్టు ఉన్నా… అది ఎప్పుడు పూర్తవుతుందో ఆ దేముడికే తెలియాలి. కొండెపి, దర్శి, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండ పాలెం నియోజకవర్గాల్లో కనీసం గ్రామాల్లో కూడా కూలి పనులు దొరకక…, సుమారు 4 లక్షల మంది ప్రతి ఏటా వలసలు వెళుతుంటారు. జిల్లాల విభజనతో ఒంగోలు నూతన జిల్లాగా ఇప్పుడున్నట్లే ఏర్పడితే మాత్రం…, ఉద్యోగ అవకాశాల్లో, ఆర్థికంగా, పారిశ్రామికంగా జిల్లాకు మిగిలేది.., చేతిలో చిప్ప మాత్రమే
ప్రతిపక్షాల గొంతులు ఎందుకు పెగలడం లేదు…?
జిల్లాల ఏర్పాటుతో ఇంత అన్యాయం జరుగుతున్నా.. ప్రతిపక్షాల గొంతులు మాత్రం మూతపడ్డాయి. గ్రానైట్ పరిశ్రమలలో అక్రమాలు జరిగాయని, నిబంధనలు ఉల్లంఘించారని ఏపీ ప్రభుత్వ గత 8 నెలల కాలంలో అనేక సార్లు దాడులు చేసి.., పారిశ్రామిక వేత్తలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకుల అనుచరులపై సుమారు 2,400 కోట్ల రూపాయల జరిమానాలు విధించింది.
ఈ పన్నుల్లో దాదాపు 800 కోట్ల వరకూ టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన శిద్ధా రాఘవరావు, టీడీపీ సీనియర్ నేత కరణం బలరామకృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు, టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, టీడీపీ నేతల అనుచరులకు చెందిన గ్రానైట్ సంస్థలపై విధించారు. దీంతో శిద్దా, కరణం జై వైసీపీ అని ఫ్యాను కండువా కప్పుకున్నారు.
గొట్టిపాటి, పోతుల తమ సమస్యల్లో తాము ఉన్నారు. బీజేపీ తరఫున నేతలు ఉన్నా వారు సైలెంట్ అయ్యారు. వామపక్షపార్టీలు ఎప్పటిలా రౌండ్ టేబుల్ మీటింగ్స్ కి పరిమితం అయ్యాయి. మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, సంతనూతలపాడును 80 కి.మి దూరంలో ఉండే బాపట్లలో కంటే, 20 కి.మి. దూరంలో ఉన్న ఒంగోలులో కలపాలని.. సీఎం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా, ఎంపీ స్థానాల పరిధిలోనే జిల్లాల ఏర్పాటు ఫైనల్ అని జగన్ స్పష్టం చేయడంతో ఇక బాలినేని సైలంట్ అయిపోయారు.
దీంతో ఎంపీ స్థానాల ప్రాతిపదికన.., ఇప్పుడున్న నియోజకవర్గాల ప్రాతిపదికన ఒంగోలు జిల్లా ఏర్పాటు చేస్తే ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పే నాథుడే లేకుండా పోయాడు.
జిల్లాల ఏర్పాటులో అధికారులే కీలక పాత్ర పోషిస్తుండటంతో, వారన్నా జరిగే నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారా? అనేది సందేహం. లేకపోతే 2026లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో సంతనూతలపాడు, కందుకూరు నియోజకవర్గాలను ఒంగోలు జిల్లాలో కలిపి న్యాయం చేయొచ్చు.., ఇప్పుడు ఇలానే కానిద్దాం అని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి చేతులు దులుపుకుంటారో..? తెలియాలంటే మాత్రం 2021 మార్చి 31 వరకూ వేచి చూడాల్సిందే….!