ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్, ఉవరకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ యాక్షన్ లోకి దిగిపోయారు. మొన్నటిదాకా జగన్ సర్కారు కొత్తది కదా అన్న ధోరణితో సాగిన పయ్యావుల.. జగన్ సర్కారు రెండేళ్ల కాలాన్ని ముగించుకున్న తర్వాత నేరుగానే యుద్ధ రంగంలోకి దిగిపోయినట్లుగా కనిపిస్తున్నారు. గురువారం విజయవాడలోని రాజ్ భవన్ కు వెళ్లిన పయ్యావుల.. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ సర్కారు చేస్తున్న ఖర్చులపై ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా జగన్ సర్కారు ఎలాంటి లెక్కాపత్రం లేకుండానే విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న వైనాన్ని గవర్నర్ ముందు ఆధారాలతో సహా పెట్టారు.
రూ.41 వేల కోట్లకు లెక్కాపత్రం లేదట
ఈ సందర్భంగా పయ్యావుల ప్రస్తావించిన అంశాలు జగన్ సర్కారును ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. పయ్యావుల ఏఏ అంశాలను బయటపెట్టారంటే.. ట్రెజరీ కోడ్ ప్రకారం ప్రభుత్వంలోని ఏ శాఖ అయినా ట్రెజరీ నుండి డబ్బు తీసుకునేటప్పుడు అది ఎందుకు తీసుకుంటున్నామో?, దేనికి ఖర్చు పెడుతున్నామో? బిల్లులో పేర్కొనాలి. కానీ అలాంటిదేమీ చూపించకుండా జగన్ ప్రభుత్వంలోని వివిధ శాఖలు ప్రత్యేక బిల్లు అంటూ 10,806 బిల్లుల కింద రూ.41,043 కోట్లను విత్ డ్రా చేశాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 161, 151/2 లను ప్రస్తావించిన పయ్యావుల.. రాష్ట్రప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతిగా రాష్ట్ర ఆర్థిక, జమ ఖర్చుల నిర్వహణపై దృష్టి పెట్టాలని..గడచిన రెండేళ్లకు సంబందించిన లెక్కలపై కాగ్ తో స్పెషల్ ఆడిట్ జరిపించాలని గవర్నర్ ను కోరారు. ఈ సందర్భంగా ఇదే విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి కాగ్ రాసిన లేఖలను వినతి పత్రానికి జత చేశారు.
హెచ్చరించినా తీరు మారలేదా?
ఇదిలా ఉంటే.. ఈ తరహా లెక్కాపత్రం లేని వ్యయంపై ఇదివరకే జగన్ సర్కారును పయ్యావుల హెచ్చరించారట. అయితే ఆయన మాటను లెక్కచేయకుండా ఆ తర్వాత కూడా జగన్ సర్కారు తనదైన శైలి లెక్కల్లేని ఖర్చులతోనే ముందుకెళ్లిందట, దీంతో ఈ తరహా పద్దతిపై కఠినంగా వ్యవహరిస్తే తప్పించి రాష్ట్ర ఖజానాకు న్యాయం చేయలేమన్న భావనతోనే పయ్యావుల గవర్నర్ తో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇకపై పీఏసీ చైర్మన్ గా పయ్యావుల పూర్తిగా యాక్షన్ లోనే ఉంటారని, వెరసి జగన్ సర్కారు లెక్కల్లేని ఖర్చులకు కళ్లెం పడక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- టీ, బిస్కెట్లకే రూ.8 కోట్లు నాకేశారు..!