గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఎన్ని అవార్డులు వచ్చినా తక్కువే. అలాంటి భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం బాలుకు రావడం తెలుగు జాతికి గర్వకారణం. అసలు బాలుకు భారత రత్న ఇవ్వాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోరాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ కూడా రాసింది. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి బాలుకు సముచిత గౌరవం కల్పించింది.
మన దేశంలో అత్యున్నత పురస్కారంగా భావించే భారత రత్న తర్వాత రెండో స్థానంలో ఉండే పురస్కారం పద్మవిభూషణ్. ఈ పురస్కారాన్ని 1954 జనవరి 2న నెలకొల్పారు. వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి మాత్రమే ఈ పురస్కారం లభిస్తుంది. ఇప్పటిదాకా అనేకమంది లబ్ధప్రతిష్ఠులకు ఈ పురస్కారాలు లభించాయి. బాలుకు మాత్రం మరణానంతరం ఈ పురస్కారం లభించింది. ఆయనకు 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అవార్డులు కూడా లభించాయి. భారత ప్రభుత్వం ఆయనను మూడోసారి ఈ పురస్కారంతో గౌరవిస్తోంది.
మరణానంతరం అవార్డులు అందుకున్నవారు
మనిషి జీవించి ఉండగా ఇలాంటి పురస్కారాలు అందుకుంటే వారికి లభించే ఆనంద వేరు. కానీ కొంతమందికి మాత్రం మరణానంతరం మాత్రమే ఈ పురస్కారాలు దక్కాయి. అలాంటివారిలో మన బాలు ఒకరు. మరణానంతరం ఈ పురస్కారం లభించిన వారిలో మొదటిసారిగా 2001లో సాహిత్యం, విద్య రంగాల్లో రాజారావుకు దక్కింది. ఆ తర్వాత 2008లో పర్వతారోహకులు ఎడ్మండ్ హిల్లరీకి, 2011లో ప్రజా వ్యవహారాలు నిర్వహించిన లక్ష్మీచంద్ జైన్ కూ, 2016లో ధీరూభాయ్ అంబానీకీ, 2017లో సుందర్ లాల్ పట్వా, పీఏ సంగ్మాలకూ ఈ పురస్కారాలు లభించాయి. ఇప్పుడు వీరి సరసన ఎస్పీ బాలు కూడా చేరారు.
Must Read ;- ఆ నలుగురు : తెలుగు పద్మాలు.. వీరే!