Panjshir Was Also Captured By The Taliban :
ఆఫ్ఘనిస్తాన్ ను ఎలాగైనా తమ చెప్పు చేతల్లోకి తీసుకోవాలనుకున్న ఉగ్రమూక తాలిబాన్ల కల నెరవేరింది. దాదాపు నెల రోజులకు పైగా ఆఫ్ఘన్ పై విరుచుకుపడ్డ తాలిబాన్లు.. దేశంలోని ఒక్కో ప్రాంతాన్నే చేజిక్కించుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో చుట్టూ పర్వత ప్రాంతాలతో శత్రు దుర్భేధ్యంగా ఉన్న పంజ్ షీర్ మాత్రం తాలిబాన్ల వశం కాలేదు. అక్కడి ప్రజలు తాలిబాన్లను తిప్పికొట్టడమే కాకుండా ఆ ఉగ్ర మూకలోని వందలాది మంది ప్రాణాలను తీశారు. ఈ క్రమంలో పంజ్ షీర్ ప్రాంతాన్ని తమ వశం చేసుకునేందుకు తాలిబాన్లు చాలానే శ్రమించాల్సి వచ్చింది. తాజాగా పంజ్ షీర్ గవర్నర్ కార్యాలయంపై తాలిబాన్ల తెలుపు రంగు జెండా ఎగిరింది. దీంతో పంజ్ షీర్ కూడా తాలిబాన్ల వశమైపోయిందని స్పష్టమైంది.
చర్చలు విఫలం
ఆఫ్ఘన్ లోని మొత్తం అన్ని ప్రాంతాలను తమ గుప్పిట పట్టేసిన తాలిబాన్లు.. పంజ్ షీర్‌ను అంత ఈజీగా చేజక్కించుకోలేకపోయారు. పంజ్ షీర్ కు చెందిన ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ హీరో అహ్మద్ షా మసూద్ గతంలో తాలిబాన్లను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. షా మసూద్ మంత్రాంగం వల్లనే నాడు ఆఫ్ఘన్ ను వీడి తాలిబాన్లు పరారు కావాల్సి వచ్చింది. నాడు తాలిబాన్ల బాంబు దాడిలో షా మసూద్ ప్రాణాలు కోల్పోయినా.. ఆయన కుమారుడు అహ్మద్ మసూద్ నేతృత్వంలో ఇప్పటికీ పంజ్ షీర్ ప్రజలు తాలిబాన్లకు ముచ్చెమటలు పోయిస్తున్నారు. పంజ్ షీర్ పైకి దాడి చేసేందుకు వచ్చిన వందలాది మంది తాలిబాన్లను పంజ్ షీర్ వీరు కాల్చి పారేశారు. దీంతో మసూద్ తో రాజీ చేసుకుని అయినా పంజ్ షీర్ ను స్వాధీనం చేసుకోవాల్సిందేనని తాలిబాన్లు భావించారు. అయితే మసూద్ పెట్టిన కొన్ని డిమాండ్లు నచ్చని తాలిబాన్లు చర్చలను నిలిపేసి దాడులు మొదలెట్టారు. ఈ క్రమంలో 3 రోజులుగా పంజ్ షీర్ లో భీకర పోరు సాగుతోంది. తాలిబాన్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పంజ్ షీర్ వాసులు ఉగ్రవాదులను ఎదురొడ్డి నిలిచారు.
వ్యూహాత్మక దాడి
ఈ క్రమంలో తాలిబాన్లు వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు. ఓ వైపున పంజ్ షీర్ వాసులతో పోరాటం సాగిస్తూనే.. పంజ్ షీర్ తమ వశం అయిపోయిందని అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించే యత్నం చేశారు. ఈ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు.. అక్కడే తలదాచుకుంటున్న ఆఫ్ఘన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలహ్ బయటకు రావాల్సి వచ్చింది. దీంతో అమ్రుల్లా సలేహ్ ఉంటున్న నివాసాన్ని గుర్తించిన తాలిబాన్లు.. డ్రోన్ల దాడితో దానిని నేలమట్టం చేశారు. సలేహ్ సెక్యూరిటీ గార్డునూ చంపేశారు. దీంతో అహ్మద్ మసూద్ తో పాటు పంజ్ షీర్ వాసులు కూడా తాలిబాన్లకు తలొగ్గారన్న వార్తలు వినిపిస్తున్నాయి. సలేహ్ ఇంటిని నేలమట్టం చేసిన మరుక్షణమే పంజ్ షీర్ గవర్నర్ కార్యాలయంపై తాలిబాన్లు తమ తెలుపు రంగు జెండాను ఎగురవేశారు. దీంతో పంజ్ షీర్ కూడా తాలిబాన్ల వశం అయిపోయిందని అంతర్జాతీయ సమాజం గుర్తించింది. అయితే తాలిబాన్లకు ఎదురొడ్డి పోరాడిన అహ్మద్ మసూద్ ఏమయ్యారన్న విషయం మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.
Must Read ;- తాలిబాన్ వర్సెస్ ఐసిస్!.. ఆఫ్ఘన్‌లో కొత్త ఫైట్!











