The Taliban Have Become A Major Threat In The Form Of Refugees :
కరడుగట్టిన ఉగ్రవాద మూక తాలిబాన్లు ఇప్పుడు ఒక్క ఆఫ్ఘనిస్తాన్ కు మాత్రమే ప్రమాదకారులు కాదు. యావత్తు ప్రపంచ దేశాలకు కూడా వీరి నుంచి ముప్పు పొంచే ఉంది. ఆఫ్ఘన్‌ను చెరబట్టేసిన తాలిబాన్లు.. ఆ దేశం నుంచే వివిధ దేశాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారట. ఇందుకోసం వారు ఆప్ఘన్ లో చిక్కుకున్న ఇతర దేశాల వారు, ఇతర దేశాలకు తరలివెళ్లేందుకు యత్నిస్తున్న ఆఫ్ఘన్ శరణార్థుల మాదిరిగా మారిపోయారట. ఇలా శరణార్థుల మాదిరిగా రూపాంతరం చెందిన తాలిబాన్లు.. తమ దేశ పౌరుల కోసం ఆయా దేశాలు పంపిన విమానాల్లో శరణార్థులతోనే కలిసి ఎక్కేశారట. ఇలా ఇప్పటిదాకా ఎంతమంది తాలిబాన్లు విదేశాలకు వెళ్లారు? ఏఏ దేశాల్లోకి వారు ఎంట్రీ ఇచ్చారు? వారిని పట్టుకునేదెలా? అన్న దిశగా ఇప్పుడు చాలా దేశాలు ఆందోళనలో కూరుకుపోయాయి.
ఎలా బయటపడింది..?
ఆఫ్ఘన్ లో చాలా దేశాలకు చెందిన వారు ఉంటున్నారు. ఆఫ్ఘన్ లోని ఆయా దేశాల విదేశాంగ శాఖ కార్యాలయాల్లో పనిచేసేందుకే కాకుండా.. ఆఫ్ఘన్‌లోని పలు కంపెనీల్లో పని చేసే నిమిత్తం వివిధ దేశాలకు చెందిన వారు ఆఫ్ఘన్ లో లక్షలాది మందే ఉన్నారు. ఆఫ్ఘన్ లో సంక్షభం నేపథ్యంలో తమ పౌరులను సురక్షితంగా తీసుకెళ్లేందుకు ఆయా దేశాలు ప్రత్యేక విమానాలను పంపుతున్నాయి. వీరితో పాటు చాలా మంది ఆఫ్ఘన్లు ఇతర దేశాలకు వలస వెళ్లేందుకు యత్నిస్తున్నారు. ఇలాంటి వారికి కూడా ఆయా దేశాలు అనుమతి ఇస్తున్నాయి. ఇదే రీతిలో ఆఫ్గాన్‌లో చిక్కుకున్న తమ వారి కోసం ఫ్రాన్స్ కూడా ప్రత్యేక విమానాలను పంపింది. వీటిలో ఫ్రాన్స్ వాసులతో పాటు ఆఫ్ఘన్ శరణార్థులు కూడా ఎక్కారు. వారితో కలిసి కొందరు తాలిబాన్లు కూడా ఎక్కారట. ఈ విమానం ఫ్రాన్స్ కు చేరిన వారిలో వెయ్యి మంది దాకా శరణార్థులు ఉన్నారట. వారందరికీ ఫ్రాన్స్ మానవతాదృక్పథంతో ఆశ్రయం ఇచ్చింది. అయితే ఈ వెయ్యి మందిలో ఓ ఐదుగురు అనుమానాస్పదంగా కనిపించగా.. వారిపై పారిస్ పోలీసులు నిఘా పెట్టారు. పోలీసుల అనుమానాలను నిజం చేస్తూ.. ఆ ఐదు మందిలో ఒకడు శరణార్థి శిబిరం నుంచి పారిపోయాడట. ఈ విషయం తెలుసుకున్నంతనే పారిస్ పోలీసులు తీవ్ర ఆందోళనకు గురై.. వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి అతడిని పట్టేశారట. విచారణలో భాగంగా అతడు తాలిబాన్లతో కలిసి పనిచేసిన వైనం బయటపడిందట.
ఇంకెన్ని దేశాలకు వెళ్లి ఉంటారో..?
ఫ్రాన్స్ కు చేరిన ఆఫ్ఘన్ శరణార్థుల్లో ఇప్పటికే ఓ తాలిబాన్ ఉగ్రవాది పట్టుబడిన విషయం ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. ఫ్రాన్స్ మాదిరే.. చాలా దేశాలు కూడా తమ దేశ పౌరుల కోసం ఆఫ్ఘన్ కు విమానాలు పంపాయి. ఆ విమానాల్లో ఆయా దేశాల ప్రజలతో పాటు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఎయిర్‌పోర్టులకు వచ్చిన ఆఫ్ఘన్ లు కూడా ఎక్కారు. వీరిని నిలువరించే పరిస్థితులు లేకపోవడంతో ఎంతమంది ఎక్కితే.. అంతమందిని, వారెవరు? ఏ దేశానికి చెందిన వారు? అన్న విషయాలను పట్టించుకోకుండానే విమానాలు తమ తమ దేశాలకు వెళ్లిపోయాయి. ఇలా దాదాపుగా ఆఫ్ఘన్ వచ్చిన అన్ని విదేశీ విమానాల్లోనూ శరణార్థుల ముసుగులో తాలిబాన్లు ఎక్కి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగి ఉంటే.. ఆప్ఘన్ తో పాటు ప్రపంచంలోని దాదాపుగా అన్ని దేశాలకూ ముప్పు పొంచి ఉందనే చెప్పక తప్పుదు.
Must Read ;- ‘శ్రీహరి సేన’ ఆఫ్ఘన్ కొంప ముంచిందా?











