కల్లోల వాతావరణం నెలకొన్న ఆఫ్ఘనిస్తాన్ లో మొదలైన మారణహోమం కొత్త మలుపు తీసుకుంది. ఆఫ్ఘన్ ను పూర్తిగా వశం చేసుకునేందుకే తాలిబాన్లు.. మరో ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో కలిసి ఈ మారణహోమానికి తెర తీశారని అంతా అనుకుంటే.. అందుకు విరుద్ధ కారణాలు వినిపిస్తున్నాయి. ఆఫ్ఘన్ ను వశం చేసుకున్న తాలిబాన్ల వైఖరి నచ్చని ఐసిస్ ఉగ్రవాదులు.. అటు సామాన్య ప్రజలు, అమెరికా బలగాలతో పాటుగా తాలిబాన్ ఉగ్రవాదులను టార్గెట్ చేసుకుని ఆత్మాహుతి దాడులు చేశారని తాజాగా తెలుస్తోంది. అంటే.. ఆఫ్ఘన్ లో చెరబట్టిన తాలిబాన్లు తమదైన శైలిలో షరియా చట్టాలను అమలు చేస్తారని భావించిన ఐసిస్ ఉగ్రవాద సంస్థ.. ఆ పని మొదలుకాకపోవడంతో తాలిబాన్లనే అనుమానించి అటాక్ చేసిందన్న మాట. మొత్తంగా రెండు ఉగ్రవాదల సంస్థల మధ్య కొనసాగుతున్న కొత్త తరహా ఫైట్ తో ఇప్పుడు ఆఫ్ఘన్ లో రక్తపాతం జరుగుతోందన్న మాట.
అసలేం జరిగిందంటే..?
ఆఫ్ఘన్ నుంచి తాలిబాన్లను తరిమేసిన నాటో బలగాలను ఇటీవలే ఆమెరికా అక్కడి నుంచి ఉపసంహరించింది. ఇదే అదనుగా తాలిబాన్లు మరోమారు ఆఫ్ఘన్ ను వశం చేసుకునేందుకు రంగంలోకి దిగారు. అమెరికా బలగాలు తొలగినంతనే.. ఒక్కటొక్కటిగానే ఆఫ్ఘన్ లోని ప్రాంతాలను వశం చేసుకుంటూ వచ్చిన తాలిబాన్లు.. పంజ్ షీర్ ప్రాంతం సహా మొత్తం దేశమంతటినీ తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. అయితే పంజ్ షీర్ ను వశం చేసుకోవడం తాలిబాన్లకు సాధ్యం కాలేదు. ఈ క్రమంలో ఓ వైపు పంజ్ షీర్ నేతలతో చర్చలు జరుపుతున్న తాలిబాన్లు.. అమెరికాతోనూ చర్చలు మొదలెట్టారట. ఈ విషయం ఎలా లీక్ అయిందో గానీ.. నేరుగా ఐసిస్ ఉగ్రవాదుల చెవిన పడిందట. ఆఫ్ఘన్ ను తమ చెప్పుచేతల్లోకి తీసుకుని కఠినమైన షరియా చట్టాన్ని అమలు చేస్తుందని భావించిన తాలిబాన్లు.. ఏకంగా అమెరికాతో చర్చలకు దిగారన్న విషయం ఐసిస్ ఉగ్రవాదులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. ఈ కారణంగానే వెనువెంటనే రంగంలోకి దిగిపోయిన ఐసిస్ ఉగ్రవాదులు కాబూల్ కేంద్రంగా దాడులు చేస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన అమెరికా ఆఫ్ఘన్ వాసులతో పాటు అక్కడున్న వివిధ దేశాల వారిని హెచ్చరించింది. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరింది. అయితే ఈలోగానే ఐసిస్ గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత వరుస ఆత్మాహుతి దాడులతో కాబూల్ ను రక్తసిక్తం చేసింది.
ఇలా బయటపడింది
వరుస ఆత్మాహుతి దాడుల విషయం తాలిబాన్లకు తెలియకుండానే జరిగింది. ఈ దాడుల్లో అమెరికా మెరైన్ సైనికులతో పాటుగా పెద్ద సంఖ్యలో సామాన్యులు చనిపోయారు. వీరిలో కొందరు తాలిబాన్ ఉగ్రవాదులు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని పసిగట్టే లోపుగానే.. తాలిబాన్లే లక్ష్యంగా కాబూల్ విమానాశ్రయం వద్ద ఐసిస్ ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ముగ్గురు తాలిబాన్ ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగినంతనే.. తమనే లక్ష్యంగా చేసుకుని ఐసిస్ దాడులు చేస్తోందని తాలిబాన్లు గుర్తించారు. ఆ వెంటనే ఐసిస్ కూడా తమ మాట కాదని, అమెరికాతో చర్చలు జరిపిన కారణంగానే తాము తాలిబాన్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని, ఈ దాడులను మరింత ముమ్మరం చేస్తామని ఐసిస్ సంచలన ప్రకటన విడుదల చేసింది. వెరసి ఇప్పుడు ఆఫ్ఘన్ లో తాలిబాన్ వర్సెస్ ఐసిస్ గా సాగుతున్న కొత్త రకం పోరులో సామాన్యులు బలైపోతున్నారు.
Must Read ;- అంతా భయపడినట్టే.. ఆఫ్ఘన్‌పై ఐసిస్ దాడులు











