ఏపీలో జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై ఒక్కొక్క ఘటనలే వరుసగా వెలుగు చూస్తున్నాయి. ఇతర పార్టీలకు… ప్రత్యేకించి తెలుగు దేశం పార్టీకి చెందిన కీలక నేతలకు చెందిన భూములను ఇతరుల పేర్లపైకి మారుస్తున్న వైనం కొత్తగా వెలుగు చూసింది. అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత పేరిట ఉన్న పట్టా భూమిని ఇతరుల పేర్లపైకి మార్చేసిన వైనం కలకలం రేపుతోంది. ఈ మేరకు ఈ విషయాన్ని బుధవారం స్వయంగా పరిటాల సునీతే స్వయంగా వెల్లడించడం గమనార్హం.
కలకలం రేపిన పరిటాల రవి హత్య
అనంతపురం జిల్లాలో పరిటాల ఫ్యామిలీకి ఓ గొప్ప చరిత్రే ఉంది. పరిటాల సునీత భర్త, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర నెరపిన రాజకీయాలు అక్కడి ప్రజలతో పాటుగా తెలుగు నేల వ్యాప్తంగా చిరపరచితమే. పేదలకు పెన్నదిగా వ్యవహరించిన పరిటాల రవి… అక్రమార్కుల గుండెల్లో నిద్రపోయారనే చెప్పాలి. ఫలితంగా ఒక్క అనంతపురం జిల్లాలోనే కాకుండా యావత్తు తెలుగు నేలలో ఇప్పటికీ పరిటాల పేరిట అభిమాన సంఘాలు కొనసాగుతున్నాయి. పరిటాలతో కలిసి నడిచిన చాలా మంది ఇప్పుడు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాత పథకం వేసి మరీ పరిటాలను హత్య చేయించారు. ఈ హత్య తెలుగు నేలలో ఎంత ప్రకంపనలు రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పరిటాల అన్న పేరు వినిపించకుండా చేయడంలో భాగంగానే ఈ హత్య జరిగినట్లు రాజకీయ విశ్లేషణలు జరిగిన వైనం కూడా తెలిసిందే.
సునీత భూమిని కాజేసే యత్నమేనా?
పరిటాల హత్య తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని అందుకున్న పరిటాల సునీత… తన వర్గాన్ని కాపాడుకుంటూనే జిల్లాలో టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచారు. ఈ క్రమంలో వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన సునీత… చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత సునీత తన కుమారుడు పరిటాల శ్రీరామ్ ను రంగంలోకి దించేసి తాను పోటీ నుంచి తప్పుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ ఓటమిపాలయ్యారు. అక్కడ పరిటాల సునీత చేతిలో వరుసగా ఓటమిపాలైన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి… మొన్నటి ఎన్నికల్లో శ్రీరామ్ ను ఓడించారు. ఆ తర్వాత నుంచి పరిటాల ఫ్యామిలీపై వరుసగా కుట్రలు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి క్రమంలోనే కనగానపల్లె మండలంలో పరిటాల సునీత పేరిట కొంత భూమి ఉంది. ఆ భూమికి సంబంధించి పక్కాగానే పట్టాదార్ పాస్ బుక్కులు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల వైసీపీ సర్కారు ఆదేశాలతో రెవెన్యూ యంత్రాంగం… ఆ భూములు ఇతరులకు చెందినవిగా ఆన్ లైన్ రికార్డుల్లో మార్పులు చేర్పులు చేశారట. ఈ విషయం తెలుసుకున్న సునీత… రెవెన్యూ యంత్రాంగంపైనా, జగన్ సర్కారు తీరుపైనా నిప్పులు చెరిగారు.
Must Read ;- అశోక్‌ను జీర్ణించుకోలేక పోతున్న వైసీపీ.. తెరపైకి ‘లింగ వివక్ష’ అస్త్రం?











