‘స్టూడెంట్ నెంబర్ 1’ .. ‘ఆది’ .. ‘ సింహాద్రి’ వంటి భారీ విజయాలు ఎన్టీఆర్ కెరియర్ ను ఎంతగానో ప్రభావితం చేశాయి. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన ఈ మూడు సినిమాలు ఆయనను స్టార్ హీరోల జాబితాలోకి చేర్చేశాయి. ఆ తరువాత ఆయన ‘ఆంధ్రావాలా’ సినిమా చేశాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ‘చక్రి’ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుక ఎన్.టి. రామారావు స్వగ్రామమైన ‘నిమ్మకూరు’లో జరిగింది.16 సంవత్సరాల క్రితం ఘనంగా జరిగిన ఆ వేడుకను గురించి .. ఆ సమయంలో తాను పొందిన అనుభూతిని గురించి తాజాగా ‘పరుచూరి పాఠాలు’ కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.
*”ఎన్టీఆర్ ను నేను మొదటి నుంచి కూడా ‘చినరామయ్య’ అని పిలుస్తుంటాను. ఆయన నన్ను ‘పెదనాన్న’ అని ఆప్యాయంగా పలకరిస్తుంటాడు. ‘ఆంధ్రావాలా’ సినిమాకంటే ముందే మేము ‘ఆది’ .. ‘అల్లరి రాముడు’ సినిమాలకి చిన రామయ్యతో కలిసి పనిచేసి వున్నాము. ఇక ‘సింహాద్రి’ కథను బాలయ్యబాబు కోసం అనుకున్నపుడు ఆ కథా చర్చల్లో పాల్గొన్నాము. అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు కాకుండా, చివరి నిమిషంలో బాలయ్యబాబుతో ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ చేయవలసి వచ్చింది. అప్పుడు ‘సింహాద్రి‘ కథ చినరామయ్య దగ్గరికి చేరింది. అందువలన చినరామయ్య చేసిన ‘సింహాద్రి’ సినిమా కథలోను మా హస్తం వుందని చెప్పగలను.
*చినరామయ్య వరుస హిట్లు కొడుతూ వెళుతుంటే, ఆయన సక్సెస్ లో మా భాగస్వామ్యం చూసుకుని మేము ఆనందించేవాళ్లం. ‘ఆంధ్రావాలా’ సినిమానాటికే చినరామయ్యతో మాకు మంచి అనుబంధం ఏర్పడిపోయింది. ఆయన చేసిన ‘ఆంధ్రావాలా’ సినిమాకి సంబంధించిన ‘ఆడియో రిలీజ్ ఫంక్షన్’ ఒక అద్భుతమనే చెప్పాలి. ఎన్టీఆర్ ఇప్పుడున్న స్థాయికి ఎదుగుతాడనే విషయం ఆ సినిమా ఆడియో రిలీజ్ రోజునే మాకు అర్థమైపోయింది. ఆ వేడుకకి నేను .. రాఘవేంద్రరావుగారు .. తమ్మారెడ్డి భరద్వాజగారు .. వీవీవినాయక్ .. వైవిఎస్ చౌదరి .. కోట శ్రీనివాసరావుగారు .. మురళీమోహన్ గారు .. ఇలా ఇండస్ట్రీ నుంచి మేమంతా బయల్దేరి వెళ్లాము. మురళీమోహన్ గారు ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
*అందరం కూడా హైదరాబాద్ నుంచి వివిధ మార్గాల్లో ‘విజయవాడ‘కి వెళ్లి, అక్కడి నుంచి కలిసి బస్సులో ‘నిమ్మకూరు’ చేరుకున్నాము. దారిపొడవునా విపరీతమైన జనం .. వేలల్లో కాదు .. లక్షల్లో ఉండివుంటారు. ఇసుక వేస్తే రాలనంత జనం .. నేల ఈనిందా అన్నట్టుగా వచ్చారు. ఆ జనాన్ని చూసి మా బస్సులు అసలు ముందుకు వెళతాయా? అనే సందేహం వచ్చింది. 20 ఏళ్ల ఓ కుర్రాడిని చూడటానికి ఇంతమంది వచ్చారా? అని ఆశ్చర్యపోయాము. ఆ రోజునే చినరామయ్య ఆ ఊళ్లో తాతయ్య – నాయనమ్మల విగ్రహాలను ఆవిష్కరించడం ఒక మహత్తరమైన అంశంగా చెప్పుకోవాలి.
*మా బస్సు ముందుగా ‘నిమ్మకూరు’ వెళుతుంటే, నన్ను చూసి ‘ఎన్టీఆర్ ఎక్కడ ?’ అన్నట్టుగా జనాలు సైగ చేసేవారు. ఆయన ‘హెలికాఫ్టర్’లో వస్తాడు అన్నట్టుగా నేను సైగచేస్తూ వెళ్లాను. నేను మొదటి నుంచి అన్నగారి భక్తుడిని. “హనుమంతుడు గుండె చీలుస్తే శ్రీరాముడు కనిపిస్తాడు. నా గుండె చీలుస్తే ఎన్టీ రాముడు కనిపిస్తాడు” అని అంతకుముందు నేను ఒక వేదికపై చెప్పాను. అన్నగారంటే నాకు అంతటి అభిమానం .. నాకు ఆయన దైవంతో సమానం.
*‘అయోధ్య’లోకి అడుగుపెట్టిన రామభక్తుడికి ఎలాంటి భావన కలుగుతుందో .. ‘నిమ్మకూరు’ నేలపై అడుగుపెట్టగానే నాకు అలాంటి భావనే కలిగింది. మేమందరం వెళ్లి అన్నగారి ఇంట్లో కూర్చున్నాము .. కాఫీలు ఇచ్చారు. ఈ ఇంట్లో అన్నగారు తిరిగారు .. ఎంత అదృష్టం ఉంటే ఆ ఇంట్లో నేను ఇప్పుడు కూర్చున్నాను అనిపించింది. ఆ రోజున నేను పొందిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది” అంటూ ఆ జ్ఞాపకాలను పంచుకున్నారు.