ఏపీలో దేవాలయాలపై వరుస దాడుల నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ సీఎం జగన్మోహన్‌రెడ్డికి కొన్ని ప్రశ్నలు సంధించారు. లోపం మీలో ఉందా? మీ నీడలో పనిచేస్తోన్న వ్యవస్థలో ఉందా అని సీఎంను ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై నిమిషాల్లో కేసులు పెట్టిన పోలీసులు, వందకుపైగా దేవాలయాలపై దాడులు జరిగితే ఇంత వరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడంపై పవన్ ధ్వజమెత్తారు. దేవాలయాలపై దాడులు చేసిన వారిని పట్టుకోలేక ప్రతిపక్షాలపై తప్పును నెట్టాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాలు గొరిల్లా వార్ ఫేర్ నడిపిస్తున్నాయని సాక్షాత్తూ సీఎం చెప్పడం అంటే తప్పించుకోవాలని చూడటమేనని పవన్ తప్పుపట్టారు.
లోపం ఎక్కడుంది?
సీఎం ఎంత బలమైన నాయకుడో అందరికీ తెలుసు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలున్నారు. 115 మంది ఐపీఎస్‌లు, మరో 115 మంది అదపనపు ఎస్పీలు, వేలాది మంది కానిస్టేబుళ్లు. 2.5 లక్షల మంది వాలంటీర్లు కూడా దేవాలయాలపై దాడులు చేసిన వారిని గుర్తించలేకపోయారా? అని పవన్ ప్రశ్నించారు. లోపం మీలో ఉందా? మీ నీడలో పనిచేస్తున్న వ్యవస్థలో ఉందా అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు.
పీఠాధిపతులు కూడా రోడ్డెక్కుతున్నారు
గత రెండేళ్ల నుంచి ఓపిగ్గా అన్నీ గమనించిన పీఠాధిపతులు కూడా రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏపీలో ఏర్పడిందని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాజకీయాలు పక్కన బెట్టి, దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
Must Read ;- పథకం ప్రకారమే దేవాలయాలపై దాడులు : చంద్రబాబు