తమిళనాడులో ఓ విలేకరి దారుణ హత్యకు గురయ్యాడు. కొంతమంది దుండగులు వేట కొడవళ్లతో విలేకరిని వెంబడించి హోసూరులో చంపటం జరిగింది. రియల్ దందాపై వార్త పత్రికలో ఆయన వరుస కథనాలు రాసినందుకే దుండగలు ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుప్పం సరిహద్దులోని తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా హోసూరులో విలగం తమిళ వార్త పత్రిక విలేకరిగా జి.నాగరాజు(47) పనిచేస్తున్నాడు.
విలేకరిగా పనిచేస్తున్న నాగరాజు హనుమంత నగర్‌లో నివసిస్తున్నాడు. అయితే నాగరాజు ఆదివారం తెల్లవారు జాము వాకింగ్‌కు వెళ్లి తిరిగి వస్తున్నాడు. సుమారు 8 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని 6గురు వ్యక్తులు అతడిని మార్గమధ్యంలో ఆపి వేటకోడవళ్లతో నాగరాజుపై దాడి చేశారు. దుండగుల నుంచి తప్పించుకునేందుకు నాగరాజు తీవ్ర ప్రయత్నం చేశాడు. అయినా కానీ వెంబడించి మరీ హత్య చేశారు. చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన నాగరాజు దాదాపు 15 ఏళ్ల క్రితమే హోసూరు వచ్చి స్థిరపడ్డారు. అక్కడ జరిగే రియల్ ఎస్టేట్ దందాపై తన పత్రికలో కథనాలు రాసినట్లు తెలిసింది. దీంతో నాగరాజుపై కోపం పెంచుకుని హత్య చేసి ఉంటారనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అయితే నాగరాజు జర్నలిస్టుగా పని చేస్తూనే రియల్ ఎస్టేట్ వ్యాపారం, వడ్డీ వ్యాపారం కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే నాగరాజు తన ప్రాణాలకు ముప్పు ఉందని, రక్షణ కావాలంటూ మూడు నెలల క్రితమే పోలీసులను కోరాడు. అందుకు పోలీసులు నిరాకరించినట్లు తెలిసింది. నాగరాజు స్వస్థలం చిత్తూరు జిల్లా, రామకుప్పం మండలం, పాలరేవు గడ్డ గ్రామం. హత్యకు గురైన నాగరాజ్‌కు భార్య, ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. హంతకులను అరెస్టు చేయడానికి కృష్ణగిరి జిల్లా ఎస్పీ పాండి గంగాధర్ ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హంతకులను పట్టుకోవడానికి పోలీసు బృందాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.
Must Read ;- వైఎస్ మరణంపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు