వాన చినుకులా తన ప్రయాణాన్ని ప్రారంభించిన రానా వరదై ఉరకడానికీ .. నదిగా పొంగడానికి .. సముద్రంగా మారడానికి ఎక్కువకాలం పట్టలేదు. తండ్రి ప్రముఖ నిర్మాత కావడం అందుకు కారణం కాదు. నటుడిగా తనని తాను నిరూపించుకోవడానికి రానా పడిన తపన .. తపస్సును తలపించే కృషి అందుకు ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. తనలోని నటుడిని వెలికి తీయడానికి రానా అవిరామంగా ప్రయత్నించాడనే విషయాన్ని ఒప్పుకోవచ్చు. అప్పటివరకూ నిర్మాణ రంగంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చిన రానా, కథానాయకుడిగా కదనరంగంలోకి దిగాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లీడర్’ సినిమాతో ఆయన తెలుగు తెరకి పరిచయమయ్యాడు.
ఈ సినిమా అంతగా ఆడలేదు .. అవకాశం ఉందిగనుక ఎంట్రీ ఇచ్చాడని అనుకున్నారు. పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ .. తడబడుతున్న అడుగులను సరిచేసుకుంటూ రానా ముందుకెళ్లడం మొదలుపెట్టాడు. ఆ నేపథ్యంలో వచ్చిన ‘ నేను నా రాక్షసి’ .. ‘నా ఇష్టం’ .. ‘కృష్ణం వందే జగద్గురుమ్‘ సినిమాలు కూడా ఆశించిన ఫలితాలను అందించలేదు. ఈ సినిమాలేవీ కూడా రానాను గురించి జనం మాట్లాడుకునేలా చేయలేకపోయాయి. అయినా రానా డీలాపడిపోలేదు. తనేమిటో నిరూపించుకోవాలనే తపనతోనే ఆయన ఉన్నాడు.
ఆ కసితోనే కసరత్తులు కొనసాగిస్తూ వెళ్లాడు. అలాంటి పరిస్థితుల్లోనే ‘బాహుబలి’ సినిమాలో ప్రతినాయక పాత్ర ఆయనను వెతుక్కుంటూ వచ్చింది. తనలోని కథానాయకుడికి సర్ది చెప్పి, ప్రతినాయకుడిని రానా బయటికి తీశాడు. ‘భల్లాల దేవుడు’గా తన నట విశ్వరూపాన్ని ఆవిష్కరించాడు. ‘ప్రతినాయకుడు అంటే ఇలా ఉండాలి .. ప్రతినాయక పాత్ర ఇలా పండాలి’ అని చెప్పుకునేంతగా ఆ పాత్రకు ప్రాణం పోశాడు. కథానాయకుడితో సమానమైన క్రేజ్ ను ప్రతినాయకుడు కూడా సంపాదించుకోవచ్చుననే విషయాన్ని ఈ సినిమా ద్వారా రానా నిరూపించాడు.
Must Read ;- పవన్ మూవీలో రానా నటిస్తున్నాడా.? లేదా.?
‘భల్లాలదేవుడు’గా రానా నటన ఎల్లలు దాటింది .. అభినందనలు అందుకుంది .. ప్రశంసలను పొందింది. దాంతో ‘బాహుబలి’ తరువాత రానా కెరియర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. ఆయన చిత్రపటాలు అభిమానుల గుండె గోడలపైకి ఎక్కాయి. రానా సినిమాలపై అంచనాలు పెరగడమనే అంశానికి ఈ సినిమాతోనే అంకురార్పణ జరిగింది. ‘బాహుబలి’లో గ్రాఫిక్స్ తీసేసి గట్టున పెట్టేస్తే అది ఒక జానపద కథ. ఆ తరువాత చారిత్రక నేపథ్యంలో రూపొందిన ‘రుద్రమదేవి‘ సినిమాలోనూ రానా మెరిశాడు. ‘చాళుక్య వీరభద్రుడు’గా ఈ సినిమాలో ఆయన కనిపించింది కాసేపే అయినా, కరెక్ట్ గా సెట్ అయ్యాడనే టాక్ వచ్చింది.
రానా సినిమాలు తెలుగులో వెంటవెంటనే రాకపోతే, ఆయన ఖాళీగా ఉన్నాడనుకుంటే పొరపాటే. ఆ సమయంలో ఆయన హిందీ సినిమాలో .. తమిళ సినిమాలో చేస్తూ ఉంటాడు. మొదటి నుంచి కూడా రానాకి సర్కిల్ ఎక్కువ. అటు బాలీవుడ్ తోను .. ఇటు కోలీవుడ్ తోను ఆయనకి మంచి పరిచయాలు ఉన్నాయి. అందువలన ఆ రెండు భాషల్లోను ఆయనకి అవకాశాలు దక్కుతుంటాయి. అక్కడి సన్నిహితుల అభ్యర్థనను కాదనలేక ఆయన అతిథి పాత్రలను కూడా చేస్తుంటాడు. షూటింగ్స్ లేనప్పుడు కూడా ఆయన స్నేహితులతోనే ఎక్కువ సమయాన్ని గడుపుతుంటాడు.
Also Read ;- ‘ధీరుడు’ గా విజృంభించనున్న భళ్ళాలదేవుడు
‘బాహుబలి 2’లో ప్రతినాయకుడిగా ప్రళయగర్జన చేసిన రానా, ‘ఘాజీ’తో మరోసారి కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కమాండర్ అర్జున్ వర్మ పాత్రలో రానా మెప్పించాడు. ఈ కథకు పూర్తి భిన్నంగా రానా చేసిన ‘నేనేరాజు నేనే మంత్రి’ సినిమా ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది. నటుడిగా రానాలోని మరో కోణాన్ని ఈ సినిమా ఆవిష్కరించింది. హీరోగా గట్టి హిట్ కొట్టాలనే రానా ముచ్చటను ఈ సినిమా తీర్చింది. ఆ తరువాత మరింత వైవిధ్యభరితమైన కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లోను విడుదల కావడానికి ఆ సినిమాలు సిద్ధమవుతున్నాయి.
ఆ మధ్య రానా కొంత అనారోగ్యానికి లోనయ్యాడు. ఆయన కోలుకుంటున్న సమయంలోనే ఇండియాలోకి కరోనా కాలు పెట్టింది. ఆ తరువాత నిన్నమొన్నటివరకూ లాక్ డౌన్ రాజ్యమే నడించింది. ఈ కారణంగానే రానా ప్రాజెక్టుల విషయంలో ఆలస్యం జరుగుతూ వచ్చింది. ప్రస్తుతం రానా ‘విరాటపర్వం‘ సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. నక్సలైట్ నాయకుడిగా రానా నటిస్తున్న ఈ సినిమా, వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంగతి అటుంచితే, రానా కెరియర్లోనే చెప్పుకోదగిన చిత్రంగా .. ఆయనకి తొలి పౌరాణిక చిత్రంగా ‘హిరణ్య కశిప’ రూపొందనుంది. గుణశేఖర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, 2022లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇలా రానా క్రేజ్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఆకాశాన్ని అలుముకుంది. భారీ ప్రాజెక్టులతో .. ఘనవిజయాలతో దూసుకుపోతున్న రానా పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ‘ది లియో న్యూస్’ టీమ్ ఆయనకి శుభాకాంక్షలు అందజేస్తోంది.
— పెద్దింటి గోపీకృష్ణ
Also Read ;- అదృష్టానికి కేరాఫ్ అడ్రెస్ పూజా హెగ్డే