మణిరత్నం ఒక సినిమా చేసేటప్పుడు ఆ సినిమాను గురించి తప్ప మరే విషయాన్ని గురించి ఆలోచన చేయరు. ఆ సినిమాను ఒక యజ్ఞంలా మొదలుపెట్టేసి .. ఒక తపస్సులా పూర్తిచేస్తారు. సాంఘిక చిత్రాల విషయంలోనే అంతటి శ్రద్ధ చూపే మణిరత్నం, ఇక చారిత్రక చిత్రాల విషయంలో ఎంతటి అంకితభావంతో పనిచేస్తారనేది అర్థం చేసుకోవచ్చు. అందుకు ‘పొన్నియిన్ సెల్వన్’ ప్రాజెక్టు ఒక ఉదాహరణ. మణిరత్నం రూపొందిస్తున్న తాజా చిత్రం ఇదే. పాన్ ఇండియా మూవీగా ఇది రూపొందుతోంది.
లైకా ప్రొడక్షన్స్ వారితో కలిసి మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ అనే ఒక భారీ చారిత్రక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రాజరాజచోళుడుకి సంబంధించిన కథ ఇది. ‘కల్కి’ కృష్ణమూర్తి రాసిన ఒక నవల ఆధారంగా ఈ సినిమా నిర్మితమవుతోంది. కథాకథనాల పరంగా .. ఖర్చు పరంగా .. కాస్ట్యూమ్స్ పరంగా ఈ సినిమా చేయడం చాలా కష్టమైన పైనే. ఇది ఒక ప్రయోగంలాంటిది .. అంతకుమించి సాహసం వంటిది. అందువలన దర్శక నిర్మాతలెవరూ ఇంతకాలంగా ఈ కథను కదిలించే సాహసం చేయలేదు. కానీ మణిరత్నం అందుకు పూనుకున్నారు.
లాక్ డౌన్ కి ముందే ఆయన ఈ కథను భారీతారాగణంతో పట్టాలెక్కించారు. లాక్ డౌన్ ముగిసిన తరువాత జనవరి 6వ తేదీన హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాను షూటింగును తిరిగి ప్రారంభించారు. ప్రధానమైన పాత్రల కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ చేస్తూ వచ్చారు. నిన్నటితో ఈ సినిమా మేజర్ షెడ్యూల్ షూటింగు ముగిసింది. ఆ తరువాత షెడ్యూల్ ఎప్పుడు .. ఎక్కడ మొదలవుతుందనేది త్వరలో తెలియనుంది. వివిధ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాలో, ఉత్తరాదికి .. దక్షిణాదికి చెందిన పలువురు ఆర్టిస్టులు నటిస్తున్నారు.
Must Read ;- 20 ఏళ్ల తర్వాత నటన వైపు శాలిని చూపు











