తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన శనివారం తిరుమల అన్నమయ్య భవన్ లో తితిదే ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆమోదం తెలిపిన పలు నిర్ణయాలను వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. 2021-22 సంవత్సరానికి గానూ రూ. 2,937 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆమోదించినట్లు తెలిపారు. అంతేకాకుండా..ఉగాది నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించడానికి బోర్డు ఆమోదం తెలిపినట్టు చెప్పారు.
రథసప్తమి వాహన సేవలు, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారంతో పాటు పలు కార్యక్రమాలు వైభవంగా నిర్వహించాలని బోర్డు నిర్ణయించిందని తెలిపారు. దేశంలోని.. తితిదేకు సంబంధించిన అన్ని కళ్యాణ మండపాల అభివృద్ధి పనులు చేపట్టాడానికి బోర్డు ఆమోద ముద్ర వేసినట్లు తెలిపారు. వీటితో పాటు తితిదే నిర్వహిస్తున్న వేద పాఠశాలను ఎస్వీ వేద విజ్ఞానపీఠంగా పేరు మార్చాలని బోర్డు నిర్ణయించినట్లు వివరించారు. తిరుమలలో విద్యుత్ విషయంలో ఏర్పడుతున్న సందిగ్ధాలు తొలగడానికి.. అతిధి గృహాలకు ఇకపై మీటర్ల ఏర్పాటు ఉంటుందని తెలిపారు. దీని ద్వారా విద్యుత్ వాడకంపై ఒక స్పష్టత లభిస్తుందని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. అయోధ్యలోని శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి కేటాయించాల్సింగా కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిపారు.
Must Read ;- ఓటర్లకు తిరుమల లడ్డూలు పంపిణీ..!











