విశాఖపట్నం పరిపాలన రాజధాని గా మారబోతున్న ఈ సమయంలో విశాఖ పోర్టు ట్రస్టులో ఉద్యోగమంటే మాటలా మరి. అక్షరాల లక్షల రూపాయలు కుమ్మరించేందుకైనా నిరుద్యోగులు ముందుకు వస్తారు. సరిగ్గా ఈ బలహీనతనే తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో వల విసిరారు. అయితే ఈ వ్యవహారాన్ని పసిగట్టిన పోర్టు ట్రస్టు అధికారులు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్ పేరుతో నకిలీ వెబ్ సైట్ క్రియేట్ చేసి నిరుద్యోగులకు వల వేస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
నకిలీ వెబ్ సైట్ తో వల…
నకిలీ వెబ్ సైట్ ను పోర్ట్ పేరిట సృష్టించి క్లాస్ ఫోర్ ఉద్యోగాలు అంటూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోర్ట్ అధికారులకు సమాచారం అందడంతో వారు అప్రమత్తమయ్యారు. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఆ ప్రకటనలు నమ్మకండి…
నకిలీ వెబ్ సైట్ల ద్వారా పోర్టులో ఉద్యోగాలు అంటూ వచ్చిన ప్రకటనలు నమ్మవద్దని పోర్టు యాజమాన్యం స్పష్టం చేస్తోంది. ఇప్పటి వరకు ఈ ఉద్యోగాల పేరిట ఎంతమంది డబ్బులు ఇచ్చి మోసపోయారు? ఈ వ్యవహారంలో విశాఖ పోర్టు ట్రస్ట్ సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా? ఎన్ని లక్షలు .. కోట్లు చేతులు మారాయి? అన్న విషయాలు పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది.











