కరోనా కష్టకాలంలో అన్ని రవాణా రంగాలు ఆక్యుపెన్సీ లేక అల్లాడుతుంటే.. విశాఖ విమానాశ్రయాన్ని ఆశ్రయిస్తున్న ప్రయాణికుల సంఖ్య మాత్రం గణనీయంగా పెరుగుతోంది. గత మూడు నెలలుగా విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగించే ప్రయాణికుల గణాంకాలు పరిశీలిస్తే, ప్రస్తుత తరుణంలో మిగతా రవాణా సాధనాల కన్నా విమాన ప్రయాణం ఉత్తమమన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు స్పష్టమ వుతోంది .
ఇంతకూ కారణాలేంటీ…
ఎయిర్ పోర్ట్ అథారిటీ విమాన ప్రయాణికులు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. టచ్ ఫ్రీ లగేజ్ స్కానింగ్, టికెటింగ్, బోర్డింగ్ ఇలా అన్ని విషయాల్లో కోవిడ్ -19 ప్రోటోకాల్ పాటిస్తుండటంతో ప్రయాణికుల్లో నమ్మకం పెరిగింది. దేశ, విదేశాల నుంచి ఎన్నో విమాన సర్వీసుల ద్వారా తమ స్వస్థలమైన ఇండియాకు చేర్చడంలో వందే భారత్ స్పెషల్ ఫ్లైట్లు కీలకంగా మారాయి. వారందరికీ కోవిడ్ పరీక్షలు చేశాకే విమానాశ్రయం నుంచి బయటకు అనుమతించారు.
ఒక్క ఉద్యోగి కూడా వైరస్ బారిన పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఒకపక్క రైళ్లు, మరోపక్క బస్సు సర్వీసులు అందుబాటులోకి వచ్చినప్పటికీ వాటి ఆక్యుపెన్సీ 40 శాతం దాటడం లేదు. అదే విమానం విషయానికి వస్తే, రోజురోజుకు ప్రయాణికులు పెరుగుతూనే ఉన్నారు.
జూన్ లో 39 వేల మంది ప్రయాణికులు విశాఖ నుంచి రాకపోకలు సాగిస్తే, జూలై నెలలో ఆ సంఖ్య 42 వేలకు చేరింది. ఆగస్టులో 60, 000, సెప్టెంబర్లో 80 వేలకు చేరుకుంది. ఈ లెక్కన ప్రస్తుత పరిస్థితుల్లో విమాన ప్రయాణం సురక్షితం అన్న భావన ప్రజల్లో ఉన్నట్టు రూఢీ అవుతోంది. అక్టోబర్ లో ఈ సంఖ్య లక్షకు చేరుకోవచ్చని విమానాశ్రయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విమాన సర్వీసులు సంఖ్య కూడా 400 నుంచి క్రమంగా 800 కు చేరుకుంది. విశాఖ పరిపాలన రాజధానిగా కార్యకలాపాలు ప్రారంభిస్తే.. విశాఖ విమానాశ్రయం మరింత రద్దీగా మారిపోవడం ఖాయం.











