దుబ్బాక ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ తీసింది. మొదట టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా ఆ ఎన్నికలు ఉంటాయని భావించినా అనూహ్యంగా బీజేపీ అక్కడ గెలుపొందడంతో ఆ పార్టీ పరిస్థితి మరింది ఇబ్బంది కరంగా మారింది. దుబ్బాకలో రెండో స్థానంలో ఉన్నా పార్టీని బతికించుకునేందుకు అవకాశం ఉండేదని … ఇప్పుడు ఆ ఆశలు కూడా గల్లంతైనట్టు పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక అనంతరం ఆ పార్టీ కార్యాలయం వైపు ఎవరూ చూడటం లేదంటున్నారు. కాగా, గతంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీకి ఇదేమి కొత్త కాదంటున్నారు ఆ పార్టీ నేతలు. అయితే గతంతో పోల్చుకుంటే ఈ సారి కాంగ్రెస్ పార్టీ మరింత ఇబ్బంది కర పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
చెడ్డ పేరు తెస్తున్న వలసలు..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ గుబులు పట్టుకుంది. ఆ పార్టీలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన నాయకులు టీఆర్ఎస్ లో చేరిపోతుండటంతో ప్రజలకు ఏం చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఇక్కడ టీఆర్ ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ ప్రజల వద్దకు వెళ్తున్న ప్రతిసారి ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తోంది. దీంతో ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు కాంగ్రెస్ నేతలకు ఏం చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి నెలకొందంటున్నారు. టీఆర్ఎస్ సైతం రాష్ట్రంలో బలపడేందుకు కాంగ్రెస్‌ని పూర్తి స్థాయిలో భూ స్థాపితం చేసే ప్రయత్నం చేసిందన్న విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.
బీజేపీ వైపు కాంగ్రెస్ నేతల చూపు..
కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు సైతం ప్రస్తుతం బీజేపీ వైపు చూస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు , మాజీ మంత్రులు బీజేపీలో చేరేందుకు క్యూ కడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే తన వాయిస్‌ను బయటకు వినిపిస్తున్నారు. మిగిలిన నేతలు ఎవరూ తమ వాదనను బలంగా వినిపించక పోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బట్టి విక్రమార్క ఖమ్మంలో రైతు సమస్యలపై పోరు సాగిస్తున్నారు. ఒంటరిగానే ఆయన ముందుకు వెళుతున్నారని.. ఆయనకు ఎవరూ మనస్ఫూర్తిగా మద్దతు ఇవ్వడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా పీసీసీ మార్పు అంశం ఆ పార్టీని మరింత వీక్ చేస్తోందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. పీసీసీ అధ్యక్షుడి నియామకం జరిగే వరకు ఇదే పరిస్థితి ఉంటుందన్న భావనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. పీసీసీ నూతన అధ్యక్షుడి నియామకం తొందరగా చేపట్టి పార్టీని గాడిలో పెట్టక పోతే ఉన్న నేతలు కూడా పార్టీకి దూరమై భవిష్యత్ అంధకారంగా మారడం ఖాయమని.. పార్టీనే నమ్ముకుని ఉన్న తమకు ఎలాంటి భరోసా ఇస్తారని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఇప్పటికైనా తెలంగాణలో పార్టీ బతికేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కింది స్థాయి కేడర్ వేడుకుంటున్నారు.