ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి చెలరేగిపోయారు. ఈసారి ఎవ్వరినీ వదల్లేదు. ఏబీఎన్ టీవీ, ఆంధ్రజ్యోతి పత్రికలో పోలవరంపై తప్పుడు రాతలు రాస్తున్నారని విజయవాడలో జరిగిన బీజేపీ నేతల సమావేశంలో సోము వీర్రాజు తీవ్ర విమర్శలు చేశారు.
ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆలోచలనకు అనుగుణంగా రాయాలనే తాపత్రయంతో పోలవరంపై తప్పుడు రాతలు రాస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోలవరం ఎత్తు తగ్గిస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ మరలా ఏడు ముంపు మండలాలను అడుగుతాడని ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథనాలను ఆయన మీడియాకు చూపారు. పోలవరం ఎత్తును 45 నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తున్నారంటూ ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ తప్పుడు రాతలు రాశారని వీర్రాజు విమర్శించారు. వైఎస్ ప్రారంభించిన పోలవరాన్ని బీజేపీ పూర్తిచేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. పోలవరంలో అవినీతికి పాల్పడ్డ వారిని కడిగిన ముత్యం చేసేందుకు ఆంధ్రజ్యోతి ఎండీ ప్రయత్నిస్తున్నారని సోము విమర్శలు చేశారు. పోలవరంపై చంద్రబాబుతో తాను చర్చకు సిద్దమని ఆయన ప్రకటించారు. పోలవరం అంచనా వ్యయంపై కూడా ఆంధ్రజ్యోతిలో తప్పుడు రాతలు రాస్తున్నారని సోము మండిపడ్డారు.
Also Read ;- అబ్దుల్ సలాం ఆత్మహత్య కేసు సీబీఐకి ఇస్తారా?
సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో వీర్రాజు వింత వాదన
నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. సలాం ఘటనలో పోలీసులను అరెస్ట్ చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. పోలీసులు వారి విధులు వారు నిర్వహిస్తే అరెస్టు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే సీఎంని అరెస్ట్ చేస్తామా? అంటూ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సలాం కుటుంబం ఆత్మహత్యపై టీడీపీ, వైసీపీ రాజకీయాలు చేస్తున్నాయని, ముస్లింల ఓటు బ్యాంక్ కోసం రాజకీయాలు చేయడం సరికాదని సోము వీర్రాజు హితవు పలికారు. టీటీడీలో అక్రమాలను ప్రశ్నిస్తే మాపై హిందుత్వ ముద్ర వేస్తున్నారని సోము మండిపడ్డారు.
పుష్కరాలకు రూ.200 కోట్లు, స్నానాలు నిషేధం
తుంగభద్ర పుష్కరాలను ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, ఘాట్లు నిర్మించనప్పుడు రూ.200 కోట్లు ఎందుకని బీజేపీ నేత సోము వీర్రాజు ప్రశ్నించారు. నదిలో పుష్కర స్నానాలు చేయొద్దని నిషేధం విధించిన ప్రభుత్వం, వందల కోట్లు ఎవరికోసం కేటాయించారని సోము అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కడప, చిత్తూరు జిల్లాల నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ పెచ్చుమీరి పోయిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Also Read ;- సాయం ఇచ్చారు సరే.. వివరాలకు అర్ధరాత్రి వెళ్తారా?