జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతోంది. డిసెంబర్ 1న గ్రేటర్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. దీంతో ప్రచారంతో ప్రధాన పార్టీలన్నీ హోరెత్తిస్తున్నాయి. ఒకరు తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్లను ప్రచారంలో దింపితే మరొకరు ఏకంగా జాతీయ నాయకత్వాన్ని రంగంలోకి దింపి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా వాడీవేడీగా గ్రేటర్ ఎన్నికల సమరం తారాస్థాయికి చేరుకుంటోంది.
టీడీపీ సైతం గ్రేటర్ ఎన్నికల్లో తమ సత్తాచాటేందుకు బరిలోకి దిగుతోంది. గతంలో ఒక్కటే సీటుకు పరిమితమైన తెలుగుదేశం ఈసారి ఏకంగా 106 స్థానాల్లో పోటీ చేసి మెజార్టీ సీట్లను చేజిక్కించుకునేందుకు బరిలో నిలిచింది. 2018 అసెంబ్లీ ఎన్నికల చేదు అనుభవం నుంచి బయటపడేందుకు తెలంగాణ తమ్ములు ప్రత్యర్థి పార్టీలకు గట్టిగానే పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం స్టార్ క్యాంపెయినర్లను ప్రచారంలోకి దింపి ఓట్లు దండుకునే ప్రయత్నాలు చేస్తూ దూసుకుపోతుంటే టీడీపీ మాత్రం ఈ విషయంలో వెనుకబడే ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి ఆంధ్ర ప్రాంత నాయకులు వారం పది రోజుల ముందే ఇక్కడ తిష్టవేసి ప్రచారంలో పాల్గొనేవారు. అంత హడావుడీ అప్పట్లో చేసేవారు. గత గ్రేటర్ ఎన్నికల్లోనూ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇక్కడ ప్రచారంలో పాల్గొనేవారు. పార్టీ గెలుపు కోసం గల్లి గల్లి తిరిగేవారు. కానీ ఇప్పుడు వారెవరూ రావడం లేదట.
గత ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికలకు కూడా చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ ప్రచారంలో పాల్గొంటారని అంతా భావించారు. ప్రచారంలో పాల్గొనాలా? వద్దా? అని వారు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలంటేనే ముందు వెనుక ఆలోచిస్తున్నారట. ఈసారి ఆంధ్రప్రాంత నేతలెవ్వరూ ఇక్కడ ప్రచారానికి రావడంలేదని తెలుస్తోంది. ఈ దఫా ఆంధ్ర ప్రాంత నేతలు ఎవ్వరూ రావడంలేదట. వస్తే ఆంధ్ర ప్రాంత నేతలని ముద్రవేస్తారేమోనని భపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే జరిగింది. 2016 ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచినప్పుడే గ్రేటర్‌లో గల్లిగల్లి ప్రచారం నిర్వహించిన టీడీపీ నేతలు ఇప్పుడు హైదరాబాద్‌కు వచ్చి ప్రచారం చేయాలంటేనే తెలంగాణ నేతలను చూసి భయపడుతున్నారట.
అందుకే ఈ ఎన్నికల బాధ్యతలను పూర్తిగా తెలంగాణ నేతలపైనే పెట్టేసినట్లు తెలుస్తోంది. ఈ ప్లాన్ ప్రకారంగానైనా ముందుకు పోతే గతంలో 2018, 2016 ఎన్నికల సీన్ రిపీట్ కాకుండా ఉంటుందని టీడీపీ నాయకత్వం భావిస్తున్నట్లు చర్చజరుగుతోంది. స్టార్ క్యాంపెయినర్లు లేకుండానే ప్రచారం నిర్వహించేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. తెలంగాణ టీడీపీ పార్టీ మొత్తం ఇక్కడి నేతలతోనే నడుస్తుందనే అభిప్రాయాన్ని కల్పించేందుకు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారట. అందుకే ఇక్కడి నేతలే ప్రచారంలో పాల్గొని తమ అదృష్టాన్ని పరిష్కరించుకోనున్నారు.
Must Read ;- వాళ్లు కానుకలతో కొడతే.. కాంగ్రెస్ క్యాష్ తో కొడుతోంది!











