Akhanda Movie Review
బాలయ్య, బోయపాటి అంటేనే హిట్ అనే మాట సినిమా ఇండస్ట్రీలో ఉంది. సింహా, లెజెండ్ మూవీల తర్వాత మళ్లీ వీరిద్దరి కలయికలో వచ్చిన మూవీ ‘అఖండ’. ద్వారకా క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా గురువారం విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథలోకి వెళితే..
అనంతపురం, వారణాసి బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమా ఇది. ముఖ్యంగా మైనింగ్ మాఫియాని అఖండ ఎలా తుదముట్టించాడు అన్నదే ప్రధాన అంశం. అనంతరపురంలో మురళీ కృష్ణ (బాలకృష్ణ) ఆ పాంతంలో ఫ్యాక్షనిజాన్ని అంతమొందించి వారిని మంచి వాళ్లగా మార్చి సామాజిక కార్యక్రమాలు చేపడుతుంటాడు. రైతుగా, సంఘ సంస్కర్తగా సాగే పాత్ర ఇది. అందరినీ తన దారిలోకి తెచ్చుకుని ప్రజలకు ఉపయోగాపడేలా చేస్తాడు. ఆ ప్రాంతానికి కలెక్టర్ గా వచ్చిన శరణ్య (ప్రగ్యా జైస్వాల్) మురళీ కృష్ణ వ్యక్తిత్వం చూసి ప్రేమిస్తుంది. అలా మురళీకృష్ణతో ఆమె వివాహం జరిగిపోతుంది. అతనికి ఓ కూతురు కూడా పుడుతుంది.
ఆ తర్వాత ఆ ప్రాంత ప్రజలు అనారోగ్యం బారిన పడతారు. దానికి కారణం మైనింగ్ మాఫియాకి చెందిన వరదరాజులు (శ్రీకాంత్) కారణమని తెలుస్తుంది. అతని సామ్రాజ్యాన్ని అంతమొందించడానికి మురళి వెళతాడు. ఆ వరదరాజులు వెనుక మరో డాన్ ఉంటాడు. మురళికి అడ్డుకట్ట వేయడానికి అతను స్థాపించిన ఆస్పత్రిని పేల్చివేస్తారు. చివరికి ఆ కేసులో మురళీకృష్ణను ఎన్ఐఏ అరెస్టు చేస్తుంది. మరి ఈ కేసు నుంచి మురళీ కృష్ణ ఎలా బయటపడ్డాడు? విలన్ సామ్రాజ్యాన్ని భూస్థాపితం చేయడానికి వచ్చిన అఖండ ఎవరు అన్నది సినిమా చూసి తెలుసుకుంటే మంచిది.
Akhanda Movie Review
ఎలా తీశారు? ఎలా చేశారు?
మాస్ మసాలా లేకుండా సినిమా తీస్తే నందమూరి అభిమానులు ఊరుకోరు కదా. అందుకే దర్శకుడు బోయపాటి శ్రీను దాని మీదే ఫోకస్ పెట్టి ఈ చిత్రాన్ని మలిచారు. ఇంతకుముందు సింహా, లెజెండ్ తరహాలోనే బలయ్య పాత్రను ఎలివేట్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమాకి ప్రాణం అఖండ పాత్ర. ఆ పాత్రను మలిచిన తీరు బాగుంది. మాస్ డైలాగులు, అంతకుమించిన యాక్షన్ సన్నివేశాలు బాలయ్య అభిమానులు అలరిస్తాయి. కథ జోలికి పోకుండా కేవలం బాలయ్య మార్కు సినిమాలాగా చూస్తే మంచిది.
ముఖ్యంగా తమన్ రీరికార్డింగును మెచ్చుకోవాలి. సినిమాని ఓ స్థాయిలో ఎలివేట్ చేయడానికి ఈ బ్యాగ్గ్రైండు స్కోర్ ఉపయోగపడింది. ఊర మాస్ డైలాగులు, వాటిని బాలయ్య పలికే విధానం అభిమానులకు పూనకాలు తెప్పిస్తాయి. ఇంటర్వెట్ బ్యాంగ్, ఆ తర్వాత వచ్చే అఖండ తాలూకు సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్ లు వెరసి అఖండ సినిమా అని చెప్పవచ్చు. సింహా, లెజెండ్ లకు మించి బాలయ్య పాత్రను ఇందులో ఎలివేట్ చేయడంలో బోయపాటి శ్రీను సఫలీ కృతమయ్యారనే చెప్పాలి. డైలాగులు రాసే విషయంలో రచయిత ఎం. రత్నం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. పాత్ర తాలూకు స్వభావం మిస్సవకుండా డైలాగులు రాశారు. పాటలు బాగున్నాయి.
నటీనటులు: బాలకృష్ణ, ప్రగ్యాజైస్వాల్, పూర్ణ, శ్రీకాంత్, జగపతిబాబు, నితిన్ మెహతా, కాలకేయ ప్రభాకర్, అయ్యప్పశర్మ తదితరులు.
సాంకేతికవ వర్గం: సంగీతం: ఎస్.ఎస్. తమన్, కెమెరా: రాంప్రసాద్, మాటలు: ఎం. రత్నం
నిర్మాణం: ద్వారకా క్రియేషన్స్
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: బోయపాటి శ్రీను
విడుదల తేదీ: 02-12-21
ఒక్క మాటలో: ఊర మాస్ అఖండ
రేటింగ్: 3/5











