విశాఖపట్నం జిల్లా కేంద్రంగా కొనసాగుతున్న సాగర నగరం విశాఖ అభివృద్ధిపై విపక్ష తెలుగు దేశం పార్టీ సంధించిన సవాల్ కు అధికార వైసీపీ నుంచి కనీస స్పందన కూడా లేకపోవడం ఏపీ ప్రలజను విస్మయానికి గురి చేస్తోందనే చెప్పాలి. నవ్యాంధ్ర నూతన రాజధానిగా చంద్రబాబు సర్కారు అమరావతిని ఎంపిక చేసి.. పైసా ఖర్చు లేకుండా 34 వేల ఎకరాలను రైతుల నుంచి సేకరించి.. అందులో పాలనకు అవసరమైన ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తి అవుతున్న తరుణంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అమరావతిని పురిట్లోనే చంపేసి కొత్తగా మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఈ క్రమంలో అమరావతి, కర్నూలు రాజధానులు ఎలా ఉన్నా.. పరిపాలన రాజదానిగా మారనున్న విశాఖ మరింతగా అభివృద్ధి చెందుతుందని, ఉత్తరాంధ్రకు ఇదో శుభపరిణామమని జగన్ సర్కారు చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు మూడు రాజధానులపై జగన్ వెనక్కు తగ్గినట్టుగా కనిపిస్తున్నా.. ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేతలు మాత్రం జెట్ స్పీడుతో సాగుతున్నారు. ఇలాంటి క్రమంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వైసీపీకి ఓ గట్టి సవాల్ విసిరారు. విశాఖ అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని, దమ్ముంటే ముందుకు రావాలని అయ్యన్నపాత్రుడు విసిరిన సవాల్ కు వైసీపీ నుంచి పిన్ డ్రాప్ సైలెన్సే ఆన్సరైంది.
అయ్యన్నవ్యూహంతో అలజడి
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రిగా అయ్యన్నపాత్రుడు ఏ విషయంపై అయినా అంత ఈజీగా బయటకు రారు. ఆయా అంశాలపై సమగ్ర సమాచారం చేతబట్టుకునే ఆయన రంగంలోకి దిగుతారు. ఇప్పుడు ఏపీ రాజధాని విశాఖే అంటూ కేంద్రం ప్రకటించడం, దానిపై మరో సవరణ ఇస్తూ రెఫరల్ కేపిటల్ గా సంబోధించడం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ చుట్టూ ఏదో జరుగుతోందని అనుమానం వ్యక్తం చేసిన అయ్యన్న.. వెనువెంటనే రంగంలోకి దిగిపోయారు. విశాఖపై ఇటు రాష్ట్రంతో పాటు అటు కేంద్రం కూడా గేమ్స్ ఆడుకుంటున్నాయని ఆరోపించిన అయ్యన్న.. అసలు విశాఖలో అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందన్న అంశాన్ని లేవనెత్తారు. ఈ అంశపై చర్చకు టీడీపీ సిద్ధంగా ఉందని.. దమ్ముంటే వైసీపీ చర్చకు రావాలని కూడా ఆయన సవాల్ విసిరారు. అయితే వైసీపీ నుంచి నిశ్చబ్ధమే సమాధానం అవడంతో.. వైసీపీ రాకపోయినా.. విశాఖ అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందన్న విషయాన్నా ప్రజలకైనా తెలియజేస్తామంటూ మరో అస్త్రాన్ని ప్రయోగించిన అయ్యన్న.. సోమవారం నాడు టీడీపీ విశాఖ కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈవైసీపీ మాయదారి మర్మాన్ని బయటపెట్టాల్సిందేనన్న కసితో సాగుతున్న అయ్యన్న వ్యూహంతో ఇప్పుడు వైసీపీలో అలజడి మొదలైపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
టీడీపీకి మట్లాడే అర్హత లేదా?
విశాఖ అభివృద్దిపై అయ్యన్నపాత్రుడు విసిరిన సవాల్ కు తాము స్పందించకుంటే.. ఆయనే వదిలేస్తారని తొలుత వైసీపీ నేతలు భావించినట్టు కనిపించింది. అయితే వైసీపీ నేతలు చర్చకు రాకున్నా.. తమ పార్టీ నేతలతోనే సమావేశం నిర్వహించి వాస్తవాలను బయటపెడతామంటూ అయ్యన్న ప్రకటించిన వెంటనే వైసీపీలో అలజడి మొదలైపోయింది. అయితే ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు గుంభనంగానే వ్యవహరిస్తున్నా.. ఆత్రం ఆపుకోలేని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మాత్రం గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఎగరవేసిన చందంగా అయ్యన్న ప్రకటన వెలువడిన వెంటనే మీడియా ముందుకు వచ్చేశారు. అసలు విశాఖ అభివృద్దిపై చర్చించే అధికారమే టీడీపీకి లేదని ఆయన ఆరోపించారు. విశాఖను అన్నిరకాలుగా అభివృద్ధి చేసేందుకే తమ ప్రభుత్వం విశాఖను పరిపాలన రాజధానిగా ఎంపిక చేసిందని చెప్పారు. అయినా ఓ బాధ్యత కలిగిన విఫక్షంగా ఉన్న టీడీపీ ఆయా అంశాలపై మాట్లాడే అర్హతే లేదంటూ వ్యాఖ్యలు చేయడం ఏమిటంటూ రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.
Must Read ;- జగన్ వద్దంటుంటే.. బొత్స కావాలంటున్నారే