Priyanka Gandhi Response For Question On Being Congress CM Face For UP Polls :
కాంగ్రెస్ పార్టీ అసలే గ్రాండ్ ఓల్డ్ పార్టీ. కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీలకు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా మారింది. తనకు పట్టుకున్న ఉత్తరప్రదేశ్ లోనూ పరిస్థితి అంత మెరుగ్గా ఏమీ లేదు. ఇలాంటి నేపథ్యంలో ఆ పార్టీకి పూర్వ వైభవం రావాలంటే.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీని అచ్చు గుద్దినట్టుగానే కనిపించే ప్రియాంకా గాంధీ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటూ చాలా రోజుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ డిమాండ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్గుగానే కనిపించిన ,ప్రియాంకా.. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీలో ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. యూపీ ఎన్నికల బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. అయితే ప్రత్యక్ష బరిలోకి దిగకుండా.. ప్రియాంక ఏమీ చేయలేరన్న కోణంలో ఆమె కీలక బాధ్యతలు తీసుకున్న ఎన్నికల్లోనే ఆమె సోదరుడు, నాడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఉన్న రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గం అమేథీలో ఓటమిపాలయ్యారు. మొత్తంగా ప్రియాంక ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే తప్పించి కాంగ్రెస్ జాతకం మారేలా కనిపించడం లేదు.
సర్వశక్తులూ ఒడ్డుతున్న బీజేపీ..
ఇక త్వరలోనే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీతో పాటు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన బీజేపీ.. మోదీ కేబినెట్ ను పూర్తిగా పునర్వవస్థీకరించింది. యూపీలో ఎన్నికలే లక్ష్యంగా జరిగిన ఈ రీషఫిల్ లో ఆ రాష్ట్రానికి చెందిన చాలా మంది నేతలకు మంత్రి పదవులు దక్కాయి. అదే సమయంలో కాంగ్రెస్ ను వీక్ చేసే చర్యలకు పదును పెట్టిన బీజేపీ.. కేంద్ర మాజీ మంత్రి, రాహుల్ సన్నిహితుడు జితిన్ ప్రసాదను లాగేసింది. మొత్తంగా ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నా.. బీజేపీ తన సర్వశక్తులనూ కూడదీసుకుంటోంది. అయితే ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉంది కదా అన్న భావనలోనే మగ్గుతున్న కాంగ్రెస్ మాత్రం ఇంకా దిద్దుబాటు చర్యలే చేపట్టలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక చూద్దాంలే అన్నట్లుగా కాంగ్రెస్ వైఖరి ఉన్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంకా స్పష్టత లేకపోతే ఎలా?
ఇలాంటి కీలక తరుణంలో ఆదివారం ఉత్తరప్రదేశ్ లో పర్యటించిన ప్రియాంకా గాంధీ వాద్రా.. ఇటీవల అక్కడ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన హింసలో గాయపడ్డ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధుల నుంచి ఆమెకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ ప్రశ్నలకు ప్రియాంక తనదైన శైలిలో ఆన్సర్లు ఇచ్చి ఉంటే.. పార్టీలో మాంచీ ఊపు వచ్చి ఉండేది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? సీఎం పదవిని స్వీకరిస్తారా? అన్న ప్రశ్నలకు పేలవమైన సమాధానం ఇచ్చిన ప్రియాంక.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగే విషయం చూద్దాం.. అంటూ సమాధానాన్ని దాటవేశారు. ఆ తర్వాత సీఎం పదవిపై మరింత ఆశ్చర్యకర రీతిలో స్పందించిన ప్రియాంక.. అన్నీ ఇప్పుడే చెప్పాలా? అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఈ తరహాలో వినిపించిన ప్రియాంక స్పందనను చూసిన కాంగ్రెస్ శ్రేణులు ఇది టూమచ్ అంటూ ఓ రేంజిలో బాధపడుతున్నారు.